Registrations in Telangana : తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు పెరిగిన తరువాత రిజిస్ట్రేషన్లు భారీగా పడిపోయాయి. విలువలు పెరుగుతాయని తెలిసిన తర్వాత వారం, పది రోజులు.. రోజుకు పది నుంచి 11వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగి.. రోజుకు వంద కోట్లకు తక్కువ లేకుండా రాబడి వచ్చేది. కానీ ఈ నెల ఒకటో తేదీ నుంచి కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి రావడంతో సగానికిపైగా రిజిస్ట్రేషన్లు తగ్గడంతోపాటు రాబడి కూడా మూడో వంతు పడిపోయింది.
3 రోజులు.. 12వేల రిజిస్ట్రేషన్లు
Telangana Registrations : ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు మూడు రోజుల్లో కేవలం 12వేల ఏడు వందల రిజిస్ట్రేషన్లు కాగా కేవలం రూ.96.27 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. రెండు రోజుల్లో 8547 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి తద్వారా రూ. 62 కోట్లు రాబడి రాగా గురువారం రోజున 4,152 రిజిస్ట్రేషన్లు జరిగి రూ.34.26 కోట్లు వచ్చినట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ధరలు పెరగడంతో.. రిజిస్ట్రేషన్లు వాయిదా
Registrations in Telangana are Decreased : గతంలో రోజుకు వందకుపైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ 20 నుంచి 30 వరకు మాత్రమే డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయని.. ఇదే పరిస్థితి మరికొంత కాలం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అవసరమైన సొమ్ము పెరగడంతో కొందరు రిజిస్ట్రేషన్లను వాయిదా వేసుకుంటున్నారని రిజిస్ట్రేషన్ శాఖ పేర్కొంది.