తెలంగాణ రాష్ట్రంలో త్వరలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువలు, రిజిస్ట్రేషన్(Registrations) రుసుంలు పెరగనున్నాయి. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గడిచిన వారం, పది రోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు తాకిడి అధికమైంది. రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు తెలిపారు. అధిక భారం పడుతుందని భావించి విలువలు పెరగక ముందే రిజిస్ట్రేషన్లు చేయించుకోడానికి ముందుకొస్తుండటం వల్ల రద్దీ నెలకొంటోంది.
పెరిగిన రిజిస్ట్రేషన్లు..
సాధారణంగా రోజుకు మూడు నుంచి నాలుగు వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు(Registrations) జరిగి రూ.25 నుంచి 30 కోట్ల రాబడి వచ్చేది. కానీ.. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువ, రిజిస్ట్రేషన్ రుసుం పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు, త్వరలో విలువలు పెరగనున్నందున రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.
కార్యాలయాలకు తాకిడి..
ఎస్‌ఆర్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 20 నుంచి 30 రిజిస్ట్రేషన్లు జరుగుతాయి కానీ.. సోమవారం రోజున వంద డాక్యుమెంట్లకుపైగా రిజిస్ట్రేషన్లు అయ్యాయి. అదే విధంగా ప్రశాంతనగర్‌లో రోజుకు 70 నుంచి 80 రిజిస్ట్రేషన్లు అవుతాయి కానీ.. సోమవారం రెండు వందలకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తాకిడి ఏ స్థాయిలో ఉందో దీనిని బట్టి అర్థమవుతోంది.
ఒక్కరోజే 7వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్..
సాధారణంగా.. రోజుకు 3,933 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి సగటున రూ.33.65 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి చేకూరేది. కానీ సోమవారం ఒక్క రోజే 7,539 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యి తద్వారా రూ. 73 కోట్ల రాబడి వచ్చింది. అంటే దాదాపు రెట్టింపు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కావడంతోపాటు రాబడి కూడా రెట్టింపు వచ్చింది.
ఈ ఏడాది.. రూ.1990.63 కోట్ల రాబడి..
జులై నెలలో ఇప్పటి వరకు 74,722 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యి రూ.639.40 కోట్లు ఆదాయం చేకూరింది. అంటే ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కరోనా ప్రభావంతో కొన్ని రోజులు రిజిస్ట్రేషన్లు జరగకపోయినా ఆ తర్వాత క్రమంగా రిజిస్ట్రేషన్లు వేగం పుంజుకున్నాయి. ఈ ఆర్థిక ఏడాది ఇప్పటి వరకు మూడు లక్షలకుపైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యి తద్వారా రూ.1990.63 కోట్లు రాబడి వచ్చింది.
ఇదీ చదవండి : RS PRAVEEN KUMAR: గురుకులాలపై ప్రవీణ్ కుమార్ ముద్ర