పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచుతూనే వస్తున్నాయి. రోజువారీ ధరల మాటున రోజుకు 20 పైసలకు తక్కువ కాకుండా.. 45 పైసల వరకు పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం వరకు పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో పెట్రోల్ లీటరు ధర రూ. 114.51లకు, డీజిల్ లీటరు ధర రూ.107.40కి ఎగబాకింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై రూ.32.90, డీజిల్‌పై రూ.31.80 లెక్కన ఎక్సైజ్ సుంకం విధిస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా.. ఐదు రూపాయిలు పెట్రోల్‌పైన, పది రూపాయిలు డీజిల్‌పైన కేంద్రం తగ్గించింది. కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్ సుంకం పెట్రోల్‌పై రూ. 27.90లకు, డీజిల్‌పై రూ.21.80లకు తగ్గింది. వాస్తవానికి ముడి చమురు ధర, కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్ సుంకం, పెట్రోల్ పంపుల యజమానులకు ఇస్తున్న కమిషన్‌లపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ విధిస్తోంది.
ఎంత ఆదా కానుందంటే..
రాష్ట్రంలో వాహనదారులు ఆర్థిక ఏడాదిలో దాదాపు 16.63 లక్షల కిలోలీటర్లు పెట్రోల్, 31.58 లక్షల కిలోలీటర్ల డీజిల్ వాడకం జరుగుతుంది. ఏడాదికేడాది వాహనాల సంఖ్య పెరుగుతుండడం వల్ల.. ఈ వాడకం పెరుగుతూనే ఉంది. రోజుకు 4,558 కిలోలీటర్లు పెట్రోల్... 8,653 కిలో లీటర్లు డీజిల్ వాడకం జరుగుతుందని చమురు సంస్థల అంచనా. తాజాగా కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ఎక్సైజ్ సుంకం పరిగణలోకి తీసుకుంటే.. పెట్రోల్‌పై లీటరుకు ఐదు రూపాయిలు తగ్గడం వల్ల దాదాపు రూ.2.28 కోట్లు, డీజిల్‌పై లీటరుకు పది రూపాయిలు తగ్గడం వల్ల దాదాపు రూ.8.65 కోట్లు మేర వాహనదారులకు ఆదా అయ్యింది. అదే విధంగా పెట్రోల్ మీద తగ్గిన ఐదు రూపాయిలపై రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న వ్యాట్ రూ.1.33లు లెక్కన రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ రూ.60.62 లక్షలు, డీజిల్ మీద తగ్గిన పది రూపాయిలపై రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న వ్యాట్ రూ.2.79లు లెక్కన రూ.2.41 కోట్లు మొత్తం కూడా వాహనదారులకు అదా అయ్యినట్లయ్యింది. మొత్తంగా తగ్గించిన ఎక్సైజ్ సుంకం కారణంగా 10.93 కోట్లు రూపాయిలు, ఈ మొత్తంపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తూ వస్తున్న వ్యాట్ మరో మూడు కోట్లు లెక్కన మొత్తం దాదాపు 14 కోట్లు వాహనదారులకు ఆదా అయ్యింది.
పెట్రోల్ బంకుల యజమానుల గగ్గోలు..
కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమైనప్పటికీ.. పెట్రోల్ బంకుల యజమానులకు ఇబ్బందికి గురి చేసిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తాము పెరిగిన ధరలతో డీడీలు చెల్లించి స్టాకు తెప్పించుకున్నామని... తక్షణమే తగ్గిన ధరలు అమలులోకి వస్తాయని చెప్పడంతో తాము లక్షలాది రూపాయిలు నష్టపోతామని పెట్రోల్ పంపుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అమర్‌నాథ్ రెడ్డి తెలిపారు. నిన్న కొనుగోలు చేసిన స్టాక్‌కు సంబంధించి తగ్గిన మొత్తాన్ని రీఎంబర్స్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: