Ration in Ap: పేదలకు తక్కువ ధరకు నిత్యవసరాలు అందించే రేషన్ దుకాణంలో .. వీధుల్లోకి వచ్చే వాహనంలో గానీ బియ్యం తప్ప మరే ఇతర వస్తువులు అందించడం లేదు. కందిపప్పు, పంచదారకు రెండేళ్ల క్రితమే ధర పెంచేసిన ఏపీ ప్రభుత్వం క్రమంగా వాటి పంపిణీలోనూ కోత విధించింది. నెల ప్రారంభంలో రేషన్ పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారులు వీటి గురించి అడగటం.. త్వరలోనే ఇస్తామని రేషన్ దుకాణదారుడు చెప్పడం.. ఈలోగా రేషన్ పంపిణీ పూర్తవడం పరిపాటిగా మారింది. కనీసం దసరా పండుగకైనా కందిపప్పు, పంచదార అందించడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
కొంతకాలంగా రాష్ట్రంలోని తెల్లకార్డుదారుల్లో 30శాతం మందికి కూడా కందిపప్పు ఇవ్వకపోగా.. పంచదార సైతం 70శాతం మందికే అందజేశారు. గతంలో పండగల సమయంలో ఇచ్చే పామాయిల్, గోధుమపిండి, ఉప్పు తదితర సరకుల్ని ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. పేదలకిచ్చే సరకులూ భారమని.. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. బకాయిలు పేరుకుపోవడంతో.. పౌరసరఫరాల సంస్థకు కందిపప్పు, పంచదార ఇచ్చేందుకు వాటి సరఫరాదారులు ముందుకు రావట్లేదు.
ఇదే కాదు.. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన పథకం కింద నాలుగు నెలలపాటు ఇవ్వాల్సిన ఉచిత బియ్యం ఊసే లేదు. కేంద్రం ఈ పథకాన్ని డిసెంబరు వరకు పొడిగించినా.. పాత బియ్యం సంగతేంటో చెప్పడం లేదు. గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేస్తే వారంలోనే రేషన్‌కార్డు మంజూరు చేస్తామని గతంలో ఘనంగా ప్రకటించిన ప్రభుత్వం అందులోనూ నాలుక మడతేసింది. ఏడాదికి రెండుసార్లకే పరిమితం చేసింది. క్రమంగా కార్డులనూ కుదించేస్తోంది. దీంతో పేద కుటుంబాలపై నిత్యావసరాల భారం పెరుగుతోంది.
వైకాపా అధికారంలోకి వచ్చిన తొలినాళ్లతో పోలిస్తే.. రేషన్ సరకుల్లో భారీ కోత పడింది. 2018 మార్చి నుంచి గత ప్రభుత్వ హయాంలో కిలో 40 రూపాయల చొప్పున రెండు కిలోలు అందించేది. దీన్ని వైకాపా ప్రభుత్వం కిలోకి పరిమితం చేసినా.. అది కూడా అందజేయడం లేదు. పైగా ధరను 67 రూపాయలకు పెంచేసింది. గతంలో పంచదార కిలో 20 రూపాయల చొప్పున అందజేయగా.. ఇప్పుడు దాన్ని 26 రూపాయలకు పెంచడమేగాక అరకిలో మాత్రమే ఇస్తోంది. 2018-19లో రాగులు, జొన్నలు, గోధుమపిండి, ఉప్పు ఇచ్చేవారు. ఇప్పుడు వాటి ఊసే లేదు. పండగ సమయాల్లో పామాయిల్, సంక్రాంతి, క్రిస్మస్ కానుకలూ ఉండేవి. వాటినీ తొలగించారు.
కార్డుదారులకు తొలుత సన్నబియ్యం ఇస్తామని చెప్పి.. తర్వాత తినగలిగే నాణ్యమైన బియ్యం ఇస్తాం అనేది తమ హామీగా నాలుక మడతపెట్టేశారు. నాణ్యమైన బియ్యాన్ని పాలీ ప్రొపెలిన్ సంచుల్లో నింపి వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ అందిస్తామంటూ.. ప్యాకింగ్ యూనిట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచి 12 కోట్లతో యంత్రాలను ఏర్పాటుచేశారు. తర్వాత ఆ ప్రతిపాదన అటకెక్కింది. ఆ తర్వాత వాహనాల ద్వారా ఇంటింటికి అందజేస్తామని తెలిపారు దీనికోసం ఏకంగా 538 కోట్లతో 9వేల 260 వాహనాలు కొనుగోలు చేశారు. ఇవి వీధుల్లోకి వస్తున్నాయి తప్ప.. ఇంటి గుమ్మం వద్దకు రావడం లేదు. మళ్లీ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ యోజన బియ్యం తీసుకోవాలంటే రేషన్ దుకాణానికి వెళ్లాల్సిందే. గతేడాదితో పోలిస్తే రేషన్‌కార్డుల సంఖ్య 3.63 లక్షల మేర తగ్గింది. కార్డుల్లోని సభ్యుల సంఖ్య సైతం 8.57 లక్షల మేర తగ్గింది. ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం లెక్కన చూస్తే 4 వేల284 టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఆదా అవుతోంది. మొత్తంగా చూస్తే 2019 జనవరి నుంచి రాష్ట్రంలోని కార్డుల్లో కుటుంబసభ్యుల సంఖ్య 3.39 లక్షల మేర పెరిగింది.
ఇవీ చదవండి: