వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు మెరుపులతో పాటు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులతో వర్షాలు పడుతాయని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రాగల 24 గంటల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు తెలిపారు.
ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు...
"వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడగా... ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇవాళ రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకట్రెండు చోట్ల అతిభారీ నుంచి అత్యంత భారీ వానలు కురవనున్నాయి. శుక్రవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం ఒకట్రెండు చోట్ల భారీ వానలు కురిసే అవకాశం ఉంది."- వాతావరణ కేంద్రం
ఈదురుగాలులతో కూడిన వర్షాలు
నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్‌కర్నూలు, జగిత్యాల, ఖమ్మం, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ గ్రామీణం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, వికారాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా కురవనున్నట్లు తెలిపారు. ఈశాన్య, తూర్పు తెలంగాణా జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల.. అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
సంబంధిత కథనాలు: