Plastic-Recycling: ప్రపంచవ్యాప్తంగా రోజుకు వంద కోట్ల ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగిస్తన్నారు..! నిమిషానికి 10 లక్షల ప్లాస్టిక్ బాటిల్స్ విక్రయాలు జరుగుతున్నాయి. ఏటా 9% మేర ప్లాస్టిక్ వ్యర్థాలు పెరుగుతున్నాయి. ప్లాస్టిక్ వాడకం ఏ స్థాయిలో ఉందో చెప్పటానికి ఈ లెక్కలు చాలు. మరి వీటిలో రీసైక్లింగ్ చేస్తున్నదెంతో తెలుసా..? 10% లోపే. మన జీవనశైలిలో భాగమైపోయిన ప్లాస్టిక్ వినియోగం తగ్గించకపోతే సమస్యలు తప్పవని ఇప్పటికే పలు అధ్యయనాలు, నివేదికలు హెచ్చరించాయి. ఇప్పుడు మరో నివేదిక ఇదే వివరిస్తోంది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఓఈసీడీ) రిపోర్టు ప్రకారం.. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 4కోట్ల 60 లక్షల టన్నుల ప్లాస్టిక్ వినియోగించారు. 2000 సంవత్సరంతో పోల్చి చూస్తే.. ఇది దాదాపు రెట్టింపు. ఇక ప్లాస్టిక్ వ్యర్థాల విషయానికొస్తే.. ఈ సంఖ్య గతేడాది 3 కోట్ల 53 లక్షల టన్నుల మేర ఉంది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌తో వచ్చిన సమస్య ఇది.
ఇప్పటికే తీవ్రమైన సమస్య
ప్లాస్టిక్ రీసైక్లింగ్‌పై ప్రపంచం ఏ మాత్రం దృష్టి సారించటం లేదని ఈ గణాంకాలే చెబుతున్నాయి. మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలలో 9% మాత్రమే రీసైక్లింగ్ అవుతుండగా.. దాదాపు 19% మేర కాల్చేస్తున్నారు. 50% మేర ల్యాండ్‌ఫిల్స్‌కు తరలిస్తుండగా.. మిగిలిన 22% వ్యర్థాలను పర్యావరణానికి హాని కలిగించేలా ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు. ఇప్పటికే సమస్య తీవ్రంగా ఉందని ఆందోళన చెందుతుంటే.. కరోనా ఇంకా సంక్లిష్టం చేసింది. 2019తో పోల్చి చూస్తే.. కరోనా వచ్చిన 2020 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ పీపీఈ కిట్ల వినియోగం పెరిగి.. వ్యర్థాల సంఖ్యా అధికమైంది. ఇదే సమయంలో ఓసారి వాడి పారేసే ప్లాస్టిక్‌నూ విపరీతంగా వినియోగించారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న కర్బన ఉద్గారాల్లో 3.4% వాటా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలదేనని పర్యావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
దాదాపు 1950వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు అంచనా వేస్తే సుమారు 8బిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు తయారయ్యాయని లెక్కలు చెబుతున్నాయి. దాదాపు 89శాతం ప్లాస్టిక్‌ను బయట పడేస్తున్నారు. కేవలం 9 శాతం మాత్రమే రీసైక్లింగ్ జరుగుతోంది. ఇది చాలా తీవ్రమైన సమస్య. ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయకపోవడానికి చాలా కారణాలున్నాయి. రీసైక్లింగ్ చేయడానికి చాలా ఎక్కువ ఖర్చవుతుంది. దాంతోపాటు రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్ వాడకం తక్కువ.
- దొంతి నరసింహా రెడ్డి, పర్యావరణవేత్త
55% వాటా కేవలం 20 సంస్థలదే..
ప్రపంచంలో వెలువడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో సగానికిపైగా అంటే.. 55% వాటా కేవలం 20 సంస్థలదేనని గతేడాది ఓ అధ్యయనం వెల్లడించింది. ప్లాస్టిక్ వేస్ట్-మేకర్స్ ఇండెక్స్ ప్రకారం, కేవలం మూడు కంపెనీలే ప్రపంచంలోని 16శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులకు కావాల్సిన ముడిపదార్థాలను తయారుచేసే దాదాపు వెయ్యి పరిశ్రమల సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం లండన్‌కు పరిశోధకులు ఈ నివేదిక రూపొందించారు. వీటిలో బహుళజాతి సంస్థలతో పాటు చమురు, గ్యాస్ కంపెనీలదే అగ్రస్థానం. ఒకేసారి వాడి పడవేసే ప్లాస్టిక్ పదార్థాల వినియోగంలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలవగా.. అమెరికా, దక్షిణకొరియా, యూకే, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలు తరవాతి వరుసలో ఉన్నాయి. ఆస్ట్రేలియాలో అత్యధికంగా ఒక ఏడాది ఒక వ్యక్తి సగటున 59కిలోల వ్యర్థాలకు కారణమవుతున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది.
రీసైక్లింగ్‌పై అశ్రద్ధ
రీసైక్లింగ్ ద్వారా 2030 నాటికి ఆరు రెట్ల అదనపు ఉద్యోగ కల్పన చేపట్టొచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి. తద్వారా 14 లక్షల కోట్ల అదనపు ఖర్చును ఆదా చేయొచ్చని పేర్కొంటున్నాయి. అంటే దీని వాటా భారత్ జీడీపీలో 11 శాతం. రీసైక్లింగ్ పరిశ్రమలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మరికొన్ని నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ రీసైక్లింగ్ మార్కెట్ వాటా ప్రస్తుతం 25,600 మిలియన్ డాలర్లు కాగా.. 2025 నాటికి అది 41,200 మిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. అందుకే ప్లాస్టిక్ రీసైక్లింగ్ మార్కెట్‌పై దృష్టి సారించాలన్నది ఓఈసీడీ నివేదిక చెబుతున్న కీలక అంశం. నిజానికి.. ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. అందుకే...ప్రపంచ దేశాలు దీనిపై పెద్దగా శ్రద్ధ చూపటం లేదు. ఈ నిర్లక్ష్యంతోనే ప్లాస్టిక్ వ్యర్థాలు అనూహ్య స్థాయిలో పెరుగుతున్నాయి.
ప్రాణాలను బలిగొంటోన్న ప్లాస్టిక్ వ్యర్థాలు
ఏటా 3.5 కోట్ల టన్నుల ప్లాస్టిక్ కాలుష్యం పేరుకుపోతూ, అందులో నాలుగో వంతు దాకా జలాల్లోకి చేరుతోంది. అది లక్షల సంఖ్యలో సముద్ర పక్షులు, పెద్ద ఎత్తున చేపలు, క్షీరదాలను బలిగొంటోంది. ఇక భారత్‌లో చూస్తే.. దేశీయంగా ఏటా 26 వేల టన్నులదాకా పోగుపడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో దాదాపు 40 శాతం సేకరణకే నోచుకోవడం లేదని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎక్కడికక్కడ పేరుకుపోతున్న వ్యర్థాల మూలాన మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది. వాననీరు భూమిలో ఇంకక పోవడానికి, దేశంలో పలుచోట్ల వరదల బీభత్సానికీ..ప్లాస్టిక్ వ్యర్థాలే కారణమవుతున్నాయి. ప్లాస్టిక్ మట్టిలో కలిసిపోయేందుకు 450 నుంచి వెయ్యేళ్లు పడుతుందని అంచనా. ప్లాస్టిక్‌ను ఆరుబయట వాతావరణంలో దహనం చేస్తే హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫర్ డయాక్సైడ్, డయాక్సిన్స్, ఫ్యూరాన్స్, ఇతర రేణువులు, విష వాయువులు విడుదలవుతాయి. వీటిని పీల్చడం వల్ల క్యాన్సర్, ఊపిరితిత్తులు, చర్మ, నేత్ర సంబంధ వ్యాధులు తలెత్తుతాయి.
పర్యావరణానికి హానికారకమవుతోన్న ప్లాస్టిక్
ప్రపంచవ్యాప్తంగా 50 శాతం ప్లాస్టిక్ ఉత్పత్తులు ఒకసారి వాడి పారేయదగ్గవే. ఈ తరహా ప్లాస్టిక్ పర్యావరణానికి హాని కారకమవుతోంది. వీటిని నిషేధించకపోతే 2050 నాటికి భూగోళంపై జీవజాతులకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం ఐదేళ్లుగా హెచ్చరిస్తోంది. ఇప్పటికే కెన్యా ఇలాంటి ప్లాస్టిక్ వస్తువుల నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. థాయ్‌లాండ్, రువాండా తదితర దేశాలు అదే బాటన సాగుతున్నాయి. ఐరోపా దేశాలు ఇప్పటికే ప్లాస్టిక్ వాడకం తగ్గించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జర్మనీ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది. వంటింట్లో ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులు, స్ట్రాలు, ఆహార పదార్థాలు నిల్వ ఉంచే ప్లాస్టిక్ కవర్లు లాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది.
ప్లాస్టిక్‌పై పోరు
ప్లాస్టిక్‌పై పోరులో భాగంగా ఇంగ్లాండ్ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తూ 2019లోనే చట్టం చేసింది. 2020 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇంగ్లాండ్‌లో వ్యాపార రంగంలో ప్లాస్టిక్ స్ట్రాలు, స్టిర్రర్స్, ప్లాస్టిక్‌తో చేసిన చెవి పుల్లలు వంటివి అమ్మినా, కొన్నా నేరంగా పరిగణిస్తున్నారు. దివ్యాంగులు, చికిత్స పొందుతున్న వారికి వీటి వినియోగంలో మినహాయింపు ఇచ్చారు. ప్లాస్టిక్ నిషేధంపై ఐదు అంచెల ప్రణాళిక అమలు చేస్తోందా దేశం. ఇలా ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధిస్తూ.. రీసైక్లింగ్ కోసం పెట్టాల్సిన ఖర్చుని తగ్గించుకుంటున్నాయి ఆయా దేశాలు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ప్లాస్టిక్ వాడకం కాస్త తక్కువే అయినా ఉపయోగించే తీరు, వ్యర్థాల సేకరణ పద్ధతులు సక్రమంగా ఉండటం లేదు. పరిసరాల్లో నిండిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు పెనుప్రమాదాన్ని మోసుకొస్తున్నాయి.
వినియోగంలో భారత్ 94వ స్థానం
ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి ఏడాదికి సగటున 28 కిలోల ప్లాస్టిక్ వాడుతుండగా, మనదేశంలో ఒక్కొక్కరు 11 కిలోలు ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగంలో భారత్ 94వ స్థానంలో ఉంది. అయినా ప్లాస్టిక్ కాలుష్య ప్రభావితమైన పది దేశాల్లో ఒకటిగా ఉంది. విదేశాల్లో పునర్ వినియోగానికి ఉపయోగపడే మందమైన ప్లాస్టిక్‌నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అంటే...భారత్‌లోనూ ప్లాస్టిక్ రీసైక్లింగ్‌ను ప్రోత్సహించాల్సిన అవసరముందని స్పష్టమవుతోంది. అయితే..ఇప్పటికే పలు చోట్ల ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసి రహదారులు నిర్మిస్తున్నారు. బెంగళూరులో 2002 నుంచి కేకే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సంస్థ ఈ నగరంలో సుమారు 2వేల కిలోమీటర్లకు పైగా రోడ్లను వేసింది. ఇందుకోసం 10వేల టన్నుల ప్లాస్టిక్‌ను వినియోగించింది.
ప్లాస్టిక్ వ్యర్థాలను అదుపుచేయడం సాధ్యమేనా?
2016లో రూపొందిన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం ప్లాస్టిక్ ఉత్పత్తిదారు, దిగుమతి చేసుకునే సంస్థ, దాన్ని వినియోగించే సంస్థ ఆ వ్యర్థాల నిర్వహణకు జవాబుదారీతనం వహించాలి. ఇంతవరకూ అది అమల్లోకి రాలేదు. ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగానికి అనువుగా మార్చుకునే సాంకేతికత అందుబాటులోకొచ్చినా వినియోగించుకునేవారు తక్కువే. దేశంలో కేవలం 7,500 రీసైక్లింగ్ యూనిట్లు పనిచేస్తున్నాయని అంచనా. వీటిలో అధికంగా చిన్నతరహా పరిశ్రమలే. మహమ్మారిలా విస్తరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను అదుపు చేయడం వీటివల్ల సాధ్యమేనా అన్నది ప్రశ్నార్థకమే. అయితే..ప్లాస్టిక్ కవర్లు, క్యారీబాగ్‌లు 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉండకూడదనే నిబంధన ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి అమల్లోకి రానుంది. వీటితోపాటు నిర్దేశించిన ప్లాస్టిక్ వినియోగంపై ఈ ఏడాది జులై ఒకటో తేదీ నుంచి నిషేధం ఉండనుంది. వీటి తయారీ, విక్రయం, వినియోగం, దిగుమతి చేసుకోవడం, నిల్వలు ఉంచడం, పంపిణీ అన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.
రీసైక్లింగ్ ద్వారా ఎంతో ఉపయోగం
ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలు తయారు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరముంది. వాడి పారేయకుండా రీసైక్లింగ్ ద్వారా పునర్వినియోగిస్తే పర్యావరణానికి నష్టం ఉండదు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను ఇంటింటి నుంచి సేకరించి డంపింగ్ యార్డులకు చేర్చాలి. శాస్త్రీయంగా శుద్ధిచేయాలి. భూమిలో కలిసిపోయేలా చేయాలి. మరింత మెరుగైన సాంకేతికత, ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేయడంలో శాస్త్రీయ విధానాల అమలు, బడా సంస్థలూ రీసైక్లింగ్ యూనిట్లు స్థాపించేలా చర్యలు తీసుకోవడం లాంటి చర్యలతో మార్పు రాక మానదు. అదే సమయంలో వ్యర్థాల సేకరణలో ఎదురవుతున్న సవాళ్లనూ అధిగమించాల్సి ఉంది. ప్రాణాంతక వ్యాధులు విస్తరించడానికి పర్యావరణ విధ్వంసమే కారణమని పదేపదే రుజువవుతోంది. అందుకే ఈ ప్లాస్టిక్ ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవటమే మనకు క్షేమం.
ఇదీ చదవండి: