వైద్య ఆరోగ్యశాఖ(Telangana health ministry)లో పైరవీలతో సర్దుబాట్లు(డిప్యుటేషన్లు(deputations)), పని ఉత్తర్వులే(వర్క్ ఆర్డర్లు(work orders)) రాజ్యమేలుతున్నాయి. ప్రభుత్వం ఆదేశించిన ప్రదేశాలకు వెళ్లకుండా అధికారులు పెద్దఎత్తున పైరవీలు చేసుకుంటూ తమకు నచ్చిన ప్రదేశాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారుల(డీఎంహెచ్‌ఓ(district health officers)) స్థాయుల్లోనూ ఈ తరహా ధోరణి పెచ్చుమీరుతుండడం గమనార్హం. పదోన్నతులు(promotions in health department) పొందినవారూ నియామకం పొందిన స్థానాల్లో పనిచేయడానికి విముఖత చూపిస్తున్నారు.
జిల్లా అధికారులుగా డిప్యూటీ సివిల్ సర్జన్లు
సివిల్ సర్జన్ స్పెషలిస్టుగా హైదరాబాద్‌లో ప్రైవేటు ప్రాక్టీసుకు అలవాటు పడిన వైద్యులు పరిపాలన విధుల్లోకి.. అందులోనూ జిల్లాల్లో నిర్వహణకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. మరీ ఒత్తిడి చేస్తే.. హైదరాబాద్ గానీ లేదా ఆ పరిసర జిల్లాల్లోగానీ డీఎంహెచ్‌ఓలు(district medical health officers)గా నియమిస్తే వెళ్తామని చెబుతున్నారు. ఇటీవల సివిల్ సర్జన్లుగా పదోన్నతి పొంది జిల్లా అధికారులుగా బాధ్యతలు చేపట్టిన కొందరు అధికారులు.. విధుల్లోకి చేరగానే డిప్యుటేషన్లు, లేదంటే కనీసం పని ఉత్తర్వులు పొందేలా రాష్ట్ర ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. కొందరు దీర్ఘకాలిక సెలవు పెట్టి, హైదరాబాద్‌కు సరెండర్ చేయించుకొని, తిరిగి కొద్దిరోజుల తర్వాత రాజధాని, పరిసరాల్లో పోస్టింగ్ ఇప్పించుకుంటున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కింది అధికారుల(డిప్యూటీ సివిల్ సర్జన్లు/డీసీఎస్)కే బాధ్యతలు అప్పగించాల్సి వస్తోందని వైద్యవర్గాలు తెలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో దాదాపు 20కి పైగా జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. నిబంధనల మేరకు సివిల్ సర్జన్ స్థాయి అధికారికే వైద్యఆరోగ్య జిల్లా అధికారిగా బాధ్యతలు అప్పగించాలి.
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల్లో అన్నిచోట్లా శాశ్వత జిల్లా అధికారులు ఉన్నా వారి స్థానాల్లో డీసీఎస్‌లే ఇన్‌ఛార్జులుగా వ్యవహరిస్తున్నారు.
మచ్చుకు కొన్ని..
- మహబూబాబాద్‌లో డీసీఎస్‌గా కొనసాగుతున్న శ్రీరాం సివిల్ సర్జన్‌గా పదోన్నతి పొంది మంచిర్యాల జిల్లాకు శాశ్వత జిల్లా అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ నెలరోజులు విధులు నిర్వర్తించలేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు పని ఉత్తర్వులు తెచ్చుకుని వెళ్లారు. దీంతో మంచిర్యాలలో డీసీఎస్ డా.బాలు జిల్లా అధికారిగా కొనసాగుతున్నారు.
- నిర్మల్‌కు కేటాయించిన మల్లికార్జున్‌రావు మేడ్చల్‌కు పని ఉత్తర్వులు తెచ్చుకోగా.. జనగామ జిల్లాకు చెందిన డీసీఎస్ ధన్‌రాజ్ నిర్మల్‌కు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.
- ఆదిలాబాద్‌లో బాధ్యతలు నిర్వర్తించాల్సిన కృష్ణ మహబూబ్‌నగర్ జిల్లాకు పని ఉత్తర్వులపై వెళ్లగా.. అక్కడి డీసీఎస్ నరేందర్ జిల్లా అధికారిగా కొనసాగుతున్నారు.
- కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు కేటాయించిన శివ బాలాజీరెడ్డి హైదరాబాద్‌కు పని ఉత్తర్వులు తెచ్చుకోగా.. ఆదిలాబాద్ జిల్లాలో డీసీఎస్ వ్యవహరిస్తున్న మనోహర్ ఆసిఫాబాద్ జిల్లాకు బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు.
- పెద్దపల్లి జిల్లాకు కేటాయించిన సుగంధిని హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి పని ఉత్తర్వులపై వెళ్లగా.. జగిత్యాల జిల్లా వైద్యాధికారిగా కొనసాగాల్సిన ప్రమోద్‌కుమార్ పెద్దపల్లికి పని ఉత్తర్వులు తెచ్చుకుని వెళ్లిపోయారు.
- కరీంనగర్ జిల్లాకు కేటాయించిన వెంకటరమణ వరంగల్ గ్రామీణ అధికారిగా వెళ్లగా.. కరీంనగర్‌లోని కిందిస్థాయి అధికారి జిల్లా ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.
- హనుమకొండ జిల్లా వైద్యాధికారిగా ఉండాల్సిన అప్పయ్య ములుగు జిల్లాలో పనిచేస్తున్నారు.
"కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత డీఎంహెచ్‌ఓ పోస్టులు మంజూరు కాలేదు. దీంతో సర్దుబాటు ప్రాతిపదికన నియమించాల్సి వస్తోంది. పరిపాలన విధులకు ఆటంకం కలగకుండా.. అవసరాలకు తగ్గట్లుగా నిబంధనల మేరకే సర్దుబాట్లు చేస్తున్నాం."
-డాక్టర్ జి.శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు