ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని శేషాచలం సహా సమీప అడవులు ఎన్నో ప్రకృతి అందాలకు నెలవు. వర్షాకాలంలో ఈ అందాలు పచ్చని శోభను సంతరించుకుని మరింతగా ఆకట్టుకుంటాయి. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో వెలుగుచూస్తున్న కొత్త అందాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. అలాంటి కోవకే చెందుతుంది రామచంద్రాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలోని ఈ జలపాతం.
ఈ జలపాతం ఇటీవలే వెలుగులోకి వచ్చినా.. ఎంతో ప్రఖ్యాతి గాంచింది. హరిత వర్ణంతో కళకళలాడే ఈ అడవి, జలపాత అందాలను వీక్షించేందుకు ఇక్కడికి చేరుకోవాలంటే కాస్త శ్రమించాల్సిందే. రామచంద్రాపురం నుంచి రెండు కిలోమీటర్ల పాటు కొండలు, కోనలు దాటుకుంటూ వెళ్తేకానీ దీనిని చేరుకోలేం.
వర్షాకాలం మొదలయ్యాక కొండరాళ్ల పైనుంచి జలపాతం ఉవ్వెత్తున ప్రవహిస్తూ ఉంటుంది. అంతెత్తు నుంచి జాలువారే నీటి సవ్వడిని ఆస్వాదించేందుకు ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. ఆ చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాకుండా చెన్నై నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. కరోనా, లాక్‌డౌన్ కారణంగా ఇప్పుడు పర్యాటకుల తాకిడి కాస్త తక్కువగానే ఉంది.
ఇవీ చదవండి: లంక గ్రామాలను రెండుసార్లు కుదిపేసిన గోదావరి వరద