Rajya Sabha Candidates Nominations: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నామినేషన్ల దాఖలు పర్వం ముగిసింది. రాష్ట్రం నుంచి ఇద్దరు సభ్యులను పెద్దలసభకు ఎన్నుకునేందుకు ఈ నెల 24న నోటిఫికేషన్ జారీ అయింది. కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డి.శ్రీనివాస్ పదవీకాలం జూన్లో పదవీకాలం ముగియనుండటంతో.. ఈ ఎన్నిక జరగనుంది. రెండు రాజ్యసభ స్థానాలకు గానూ.. తెరాస అభ్యర్థులుగా నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర్ రావు, హెటిరో గ్రూప్స్ ఛైర్మన్ పార్థసారథి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. 25న ఉదయం 11 గంటలకు వీరివురూ నామినేషన్ వేశారు.
మరోవైపు.. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన ఇవాళ శ్రమజీవి పార్టీ తరఫున కోయల్కర్, జాజుల భాస్కర్ నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో రెండు స్థానాలకు నలుగురు నామినేషన్లు దాఖలు చేసినట్లైంది. రేపు నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ మూడో తేదీ వరకు గడువుంది. ఎన్నిక ఏకగ్రీవమైతే ఆ వెంటనే ప్రకటించి అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు అందిస్తారు. ఒకవేళ ఓటింగ్ అవసరమైతే జూన్ పదో తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజు లెక్కింపు చేపడతారు.
అంతకుముందు.. బండ ప్రకాశ్(ప్రస్తుతం ఎమ్మెల్సీ) రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో.. ఖాళీ అయిన స్థానానికి జరిగిన ఉపఎన్నికకు గాయత్రి గ్రానైట్ కంపెనీస్ అధినేత వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గాయత్రి రవి 2024 ఏప్రిల్ వరకు రెండేళ్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు.
ఇవీ చూడండి: