యూకేని ఏలుతున్న ఎలిజబెత్ మహారాణిని చిన్నప్పుడు లిలిబెత్ అని ఆమె తండ్రి ముద్దుగా సంభోదిస్తే, పెళ్లయ్యాక భర్త క్యాబేజ్ అని ప్రేమగా పిలుచుకునేవాడట. వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.
ఎలిజబెత్ మహారాణికి రెండేళ్లున్నప్పుడు తన పేరు సరిగ్గా పలకడం వచ్చేది కాదట. దాంతో ఎవరైనా అడిగితే టిలాబెత్ అనేదట. ఆ మాట ముద్దుగా అనిపించి ఆమె తండ్రి కింగ్‌జార్జ్-6 అలాగే పిలిచేవాడట. క్రమంగా అదే లిలీబెత్‌గా మారిందట. పెళ్లయ్యాక భర్త ప్రిన్స్ ఫిలిప్ మాత్రం ‘క్యాబేజ్’ అనేవాడట. దానికి ఫ్రెంచ్ పలుకుబడి ‘మో పెటీట్ చో’ మూలమట. ‘మో పెటీట్ చో’ అంటే... నా చిన్నారి క్యాబేజ్ అనీ, దాన్ని కాస్త మారిస్తే... ‘నా డార్లింగ్’ అనీ అర్థం వస్తుందట. ప్రపంచం మొత్తం ఆమెను హర్ రాయల్ హైనెస్ అని సంభోదించినా ఆమె భర్త ఇప్పటికీ క్యాబేజ్ అనే పిలుస్తాడట. రాణీకి అలా పిలిపించుకోవడమూ ఎంతో ఇష్టమట. ఇప్పటికీ క్రిస్మస్‌కార్డులపైన మహారాణి సంతకం చేసేటప్పుడు రాజకీయనాయకులకూ అధికారులకూ మాత్రం ఎలిజబెత్ ఆర్ అనీ. స్నేహితులకు ఎలిజబిత్ అనీ.. కజిన్స్‌కీ కుటుంబసభ్యుల్లో కొందరికీ మాత్రం లిలీబెత్ అనీ సంతకం చేస్తారట.