ప్రైవేట్ వర్సిటీల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం పచ్చజెండా ఊపడం వల్ల పలు విద్యా, పారిశ్రామిక సంస్థలు రంగంలోకి దిగాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచే.. విశ్వవిద్యాలయాలు ప్రారంభించేందుకు కొన్ని సంస్థలు యత్నిస్తున్నాయి. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఇప్పటికే 12దరఖాస్తులు వచ్చాయి. సర్కారు అనుమతిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభమయ్యే అవకాశముంది.
"ఇప్పటికే ఉన్న కళాశాలలనే యూనివర్సిటీలుగా మార్చేందుకు దరఖాస్తు చేసుకోగా మరికొన్ని కొత్తగా ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. వైద్య, మహిళ, నిర్మాణ సంబంధిత కోర్సుల విశ్వవిద్యాలయాల ఏర్పాటు కోసం దరఖాస్తులు వచ్చాయి"
దరఖాస్తు చేసుకున్న ప్రైవేట్ సంస్థలు
గ్రీన్‌ఫీల్డ్ కేటగిరీలో కొత్తగా యూనివర్సిటీలు ఏర్పాటుకు రాడ్‌క్లిఫ్, అమిటీ, శ్రీనిధి, మల్లారెడ్డి, నిక్‌మర్ సంస్థలు ముందుకొచ్చాయి. బ్రౌన్‌ఫీల్డ్ విభాగంలో ఇప్పటికే ఉన్న విద్యా సంస్థలను యూనివర్సిటీలుగా మార్చుకునేందుకు.. అనురాగ్, గురునానక్, ఎస్, ఎంఎన్ఆర్, టెక్‌మహీంద్రా, వోక్సన్, వాగ్దేవి సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. మహిళ విశ్వవిద్యాలయం కోసం మల్లారెడ్డి సంస్థ ముందుకురాగా.. ఎంఎన్ఆర్ గ్రూప్ ప్రత్యేక వైద్య విశ్వవిద్యాలయం కోసం రంగంలోకి దిగింది. పుణెకు చెందిన నిక్‌మర్ ప్రత్యేకంగా నిర్మాణ సంబంధిత కోర్సులతో వర్సిటీ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకుంది.
రుసుములపై సర్కారు నియంత్రణ..?
కొత్తగా ఏర్పాటయ్యే ప్రైవేట్ వర్సిటీల్లోప్రవేశాల ప్రక్రియ, రుసుములపై సర్కారు నియంత్రణ ఉండదు. రాబోయే విద్యాసంవత్సరంలో అవి అందుబాటులోకి వచ్చినా... రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కోర్సులు, సీట్లపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని ఉన్నత విద్యా మండలి వర్గాలు భావిస్తున్నాయి.
"హైదరాబాద్ శివార్లలో ప్రైవేట్‌విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు రిలయన్స్, హోండా సంస్థలు మూడేళ్ల క్రితం ముందుకొచ్చినా... ప్రస్తుతానికి అవి ఆసక్తి చూపట్లేదు. ఇప్పటికే ముంబైలో రిలయన్స్ సంస్థ వర్సిటీ ఏర్పాటు చేసినందున... తెలంగాణకు వచ్చే అవకాశం లేనట్లేనని అధికారులు చెబుతున్నారు"
ఇవీ చూడండి: హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో మూడేళ్ల బాలుడి మృతి