బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన సిద్దార్థతో పాటు...14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అపహరణకు సంబంధించి నిందితుల నుంచి సమాచారం సేకరించారు. భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీను సహా పరారీలో ఉన్నవారికోసం పోలీసులు గాలిస్తున్నారు.
యూసుఫ్‌గూడలో భార్గవరామ్ నిర్వహిస్తున్న ఎంజీఎం ఇంటర్నేషనల్ స్కూల్లోనే కిడ్నాప్‌కు పథక రచన జరిగిందని పోలీసులు గుర్తించారు. అపహరణకు ముందురోజు (జనవరి 4, 2021) ఆ పాఠశాలలో అఖిలప్రియ సమావేశం నిర్వహించారని ధ్రువీకరించుకున్నారు. రోజంతా జరిగిన సమావేశంలో అఖిలప్రియ, భార్గవరామ్, గుంటూరు శ్రీను, గుంటూరు, విజయవాడలకు చెందిన ఇతర నిందితులు పాల్గొన్నారని గుర్తించారు. ఎప్పుడు, ఎలా కిడ్నాప్ చేయాలన్న అంశాలపై చర్చించారని తెలుసుకున్నారు. కిడ్నాప్ వ్యవహారంలో పాత్ర ఉందని అనుమానిస్తున్న భార్గవరామ్ తల్లి కిరణ్మయి, సోదరుడు చంద్రహాస్‌లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
హైదరాబాద్...అమరావతి.. అఖిలప్రియ
జనవరి 5 లేదా 6న కిడ్నాప్ చేయాలని అఖిలప్రియ భార్గవరామ్, గుంటూరు శ్రీనులకు సూచించారు. హైదరాబాద్ నుంచి ఈ నెల 2న ఆళ్లగడ్డకు వెళ్లిన ఆమె.. 3న అక్కడే ఉండి.. తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు. జనవరి 4న ఉదయం ఎంజీఎం ఇంటర్నేషనల్ స్కూల్‌కు చేరుకున్నారు. నిందితులతో సమావేశమై... జనవరి 5నే కిడ్నాప్ చేయాలని చెప్పి పంపించారు. జనవరి 5న ఉదయాన్నే ఆమె అమరావతికి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రధాన కార్యదర్శి హోదాలో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గుంటూరు శ్రీను ఆమెకు ఫోన్ చేశాడు. కిడ్నాప్ ఓకే అని చెప్పడంతో ఆమె సాయంత్రం 5.45 గంటలకు అమరావతి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. అదే సమయంలో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తన నివాసానికి బయలుదేరడం.. ఆయన కోసం ట్రాఫిక్ క్లియర్ చేయడంతో... చంద్రబాబు కాన్వాయ్ వెనుకే అఖిలప్రియ తన కారును పోనిమ్మని డ్రైవర్‌కు చెప్పి వేగంగా విజయవాడ దాటేశారు.
అపహరణలో పాల్గొన్న నిందితుల అరెస్టు
అపహరణలో పాల్గొన్న నిందితులందరినీ బోయిన్‌పల్లి, టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారిలో ఐటీ అధికారులుగా నటించిన సిద్ధార్థ్, కృష్ణవంశీ, కృష్ణచైతన్య, దేవిప్రసాద్‌లు ఉన్నట్టు సమాచారం. విజయవాడలో ఉంటున్న సిద్ధార్థ్ గత ఏడాది డిసెంబరులో రెండుసార్లు హైదరాబాద్‌కు వచ్చి భార్గవ్‌రామ్‌తో కిడ్నాప్‌పై చర్చించినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి.