పుర ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. శాంతిభద్రతలపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసు శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. పురపాలక ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో 50వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక పోలీసులతో పాటు... ఎక్సైజ్, అటవీశాఖకు చెందిన సిబ్బంది కూడా బందోబస్తులో పాలుపంచుకుంటున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలతో పాటు... సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లపై ఇప్పటికే 131 కేసులు నమోదు చేశారు. నగదు, మద్యం, బహుమతులు పంపిణీ చేయకుండా నిఘా పెట్టారు.
తనిఖీల్లో భాగంగా ఇప్పటికే 51లక్షల 36వేల నగదు, 21లక్షల 22వేల రూపాయల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా 1122 కేసులు నమోదు చేసి 4969మందిపై అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా 1122 కేసులు నమోదు చేసి 4969మందిని అదుపులోకి తీసుకున్నారు. లైసెన్స్ కలిగిన 1745 ఆయుధాలను ఠాణాల్లో డిపాజిట్ చేయించుకున్నారు.
ఓటర్లు కాకుండా ఇతర అభ్యర్థులెవరైనా పోలింగ్ కేంద్రాల వద్ద ఉంటే వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు... ఏమైనా ఇబ్బందులు తలెత్తితే.. వెంటనే ఇతర పోలీసు బలగాలు అక్కడికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను ఉన్నతాధికారులు నేరుగా పర్యవేక్షిస్తున్నారు.
శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల మాదిరిగానే పురపాలక ఎన్నికల్లోనూ ఓటర్లు నిర్భయంగా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తోంది.