మంగళవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున సాధ్యమైనంత త్వరగా తుపాకులు, రివాల్వర్లు, ఇతర ఆయుధాలు, తూటాలను అప్పగించాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. జాతీయ, కార్పొరేటు బ్యాంకుల్లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీగార్డులు, ఖజానా సిబ్బంది, కొన్ని కార్పొరేటు, ప్రైవేటు సంస్థల యజమానులకు మినహాయింపు ఉందని వివరించారు. నిబంధనలు ఉల్లంఘించి ఆయుధాలు అప్పగించని వారిపై చట్టపరంగా చర్యలు చేపట్టనున్నామని తెలిపారు.
ఆయుధదారులు వీరే..
హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లో 9వేల మందికి ఆయుధాలు తమవెంట తీసుకువెళ్లేందుకు అనుమతులున్నాయి. వీరిలో ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, సైన్యం, పోలీస్‌శాఖలో విధులు నిర్వహిస్తున్నవారున్నారు. వీరితో పాటు సినీరంగానికి చెందిన కొందరు నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు గన్ లైసెన్సులున్నాయి. ఆయుధ అనుమతి ఉన్న వ్యక్తి మరణిస్తే... మిగిలిన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉన్నప్పుడు పోలీస్ అధికారులను అభ్యర్థిస్తే నిబంధనల మేరకు అప్పుడు మరణించిన వ్యక్తి కుమారుడికి లేదా కుమార్తెకు లైసెన్స్‌ను కొత్తపేరుతో ఇస్తున్నారు. ఇక బహిరంగ ప్రదేశాలు, జనసమ్మర్థ ప్రాంతాలకు వెళ్లలేని కుటుంబ నేపథ్యం ఉన్న మహిళలు, యువతులకు పోలీసులు గన్ లైసెన్స్‌లు ఇస్తున్నారు. ఆయుధాలు వెంట తీసుకెళ్లేందుకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా... దరఖాస్తుదారుడి హోదా, ప్రాణహాని, ఇతర అంశాలన్నింటినీ క్షుణ్ణంగా విచారించాకే అనుమతులు ఇస్తున్నారు.