రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో మావోయిస్టు ఉద్యమం తీవ్రమవుతుందన్న అంచనాలను తల్లకిందులు చేస్తూ ఇటీవలి వరకు ప్రశాంత వాతావరణమే నెలకొంది. కానీ ఆరు నెలలుగా మావోయిస్టు కార్యకలాపాలు పెరుగుతున్నాయి. బలహీనపడ్డ శ్రేణులను పటిష్ఠపరిచేందుకు మావోయిస్టులు తొలుత నియామకాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ విషయంలో కొంత సఫలమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. రాష్ట్రం మొత్తమ్మీద ఈ మధ్యకాలంలో 25 మంది వరకు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు అంచనా.
ఇదే సమయంలో వరుస ఎదురుదెబ్బలతో డీలాపడ్డ శ్రేణుల్లో మనోస్థైర్యం నింపుతూ.. ఉనికి చాటుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో తెరాస నాయకుడిని హత్య చేయడమే ఇందుకు నిదర్శనం. అలాగే ఇన్ఫార్మర్ల నెపంతో ఛత్తీస్‌గఢ్‌లో పలువురు ఆదివాసీలను హతమార్చారు. ఒక్కసారిగా మావోయిస్టు కార్యకలాపాలు పెరగడం వల్ల పోలీసుశాఖ అప్రమత్తమైంది. దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు అధికారులను యుద్ధప్రాతిపదికన మార్చింది. ఈ రంగంలో అనుభవం ఉండి, గతంలో పనిచేసిన వారిని క్షేత్రస్థాయిలో నియమించింది.
గెరిల్లా యుద్ధతంత్రంలో ప్రత్యేక శిక్షణ పొందిన గ్రేహౌండ్స్ బలగాలతో ప్రభావిత జిల్లాల్లో గాలింపులు తీవ్రం చేసింది. ఇవి నిరంతరం కొనసాగాలంటే ఇప్పుడున్న బలగాలు సరిపోవు. అందుకే అదనపు బలగాలను సరిహద్దులకు తరలించాలని భావిస్తున్నారు. కొత్తగా విధుల్లో చేరబోతున్న కానిస్టేబుళ్లను ఇందుకు కేటాయించనున్నారు. ఈ నెలలోనే దాదాపు 11 వేల మంది కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతి జిల్లాలోనూ కనీసం పది బృందాలు ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. వచ్చే నెల నుంచే వీరిని రంగంలోకి దించబోతున్నారు. కేంద్ర బలగాలను కూడా రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇవీచూడండి: ఇద్దరు పిల్లలతో సహా... తల్లి అదృశ్యం