తనీష్ ఓ వ్యాపారి. అత్తాపూర్‌లో నగల దుకాణం ఉంది. చాలాకాలంగా స్కూటర్ ఉపయోగిస్తున్నారు. బైకు ఉన్నా.. వస్తువులు తీసుకెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుందని ఎక్కువగా స్కూటరే వాడేవారు. మైలేజీ గురించి ఎన్నడు పట్టించుకోలేదు. రెండు వారాలుగా ఉన్నట్టుండి స్కూటర్‌ను ఇంటి దగ్గర వదిలి బైక్‌పై వెళుతున్నారు. కొత్తగా బైక్ ఏంటి అని అడిగితే పెట్రో ధరలు రోజు పెరుగుతూ జేబుకు చిల్లులు పెడుతున్నాయని.. స్కూటర్ అసలే మైలేజీ ఇవ్వదని వాపోయారు. బైక్ అయితే దాదాపుగా లీటర్‌కు 50 కి.మీ. వరకు ప్రయాణించవచ్చని చెప్పారు. కరోనాతో వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతున్నాయని, ఖర్చులు తగ్గించుకోకపోతే అప్పులతో రోడ్డున పడటం ఖాయమన్నారు. పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్య, మధ్యతరగతి వాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. లీటర్ ధర వంద రూపాయలకు చేరేలా ఉందని.. పెట్రోపై పన్నుల భారాన్ని తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూనే ఖర్చులు తగ్గించుకోవడంపై ఆలోచిస్తున్నారు. కనీస టిక్కెట్ రూ.5తో 20 కిలోమీటర్లు ప్రయాణించే వీలున్న ఎంఎంటీఎస్‌ను త్వరగా పునఃప్రారంభించాలని కోరుతున్నారు.
బండి బయటకు తీయాలంటే..
- నగరంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు పెట్రోలు లీటర్‌కు ఐదు రూపాయల వరకు పెరిగింది. రోజుకు పావులా అంటూ పెంచుకుంటూపోతున్నారు. కొవిడ్ అనంతరం ప్రజారవాణా పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు.
- దీంతో పెద్ద ఎత్తున వాహనాలు కొనుగోలు చేశారు. సౌకర్యం చూశారే తప్ప అప్పుడు మైలేజీ గురించి పెద్దగా ఆలోచించలేదని.. పెట్రోలు ధరలు పెరగడంతో ఇప్పుడు బండి బయటకు తీయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోందంటున్నారు.
- వీధిలోని దుకాణానికైనా ఇదివరకు ద్విచక్రవాహనంపైనే వెళ్లేవారు. ఇప్పుడు మళ్లీ నడక అలవాటు చేసుకుంటున్నారు.
- వాహనాలు వదిలి బస్సుబాట పడుతున్నారు. మెట్రో ఎక్కుతున్నారు.. కొద్దిరోజులుగా చూస్తే సిటీ బస్సుల్లో, మెట్రోలో రద్దీ పెరిగింది.
దగ్గరి దూరాలకు సైకిల్‌ను ఉపయోగించేవారు పెరిగారు. నెల రోజుల వ్యవధిలో కొత్త సైకిళ్ల కొనుగోళ్లు పెరిగాయి.
కొవిడ్‌కు ముందు బైకు, కారు షేరింగ్ ఎక్కువగా ఉండేది. కొవిడ్ భయాలతో ఎవరి వాహనాల్లో వారే వెళ్లడం మొదలైంది. ఇప్పుడు మళ్లీ షేరింగ్ బాట పడుతున్నారు.
పెట్రోలు దొంగతనం..
ధరలు పెరగడంతో వాహనాల్లోంచి పెట్రోలు దొంగతనాలు జరుగుతున్నాయి. నగరంలో సెల్ప్ డ్రైవ్ బైకులు అందుబాటులో ఉన్నాయి. వీటిపై తిరిగినంత సేపు తిరిగి గమ్యస్థానంలో ఆపేసిన తర్వాత అందులోని మిగిలిన పెట్రోలు తీసుకుని వెళుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. గచ్చిబౌలి, మూసాపేటలో ఈ ఘటనలు పెట్రోధరల భారానికి అద్దం పడుతున్నాయి.
నడిచే వెళ్తున్నాను...
ఇంటికి కావాల్సిన కూరగాయలు, సరకులు తీసుకొచ్చేందుకు ఎక్కువగా బైకుపై వెళ్లేవాడిని. బరువులు ఎక్కువగా ఉన్నప్పుడు తప్ప రోజువారీ కూరగాయలకు నెలరోజులుగా నడిచే వెళుతున్నాను. ఇదే నాకు వాకింగ్ అవుతోంది. పెట్రోలు రోజురోజుకు పెరుగుతుండటంతో దగ్గరి దూరాలకు వెళ్లేందుకు కొత్త సైకిల్ కొన్నాను. - డి.శ్రీనివాసులు, మూసాపేట