Walking on Pebbles : ప్రజలకు ఆరోగ్యంపై పెరుగుతున్న ఆసక్తికి అనుగుణంగా పార్కుల్లో వారికి తగిన సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు పార్కుల్లో, చెరువుల వద్ద నడకదారుల కోసం ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొండాపూర్ బొటానికల్ గార్డెన్‌లో ఆక్యుప్రెషర్ పద్ధతిని పాటిస్తున్నారు.
మనసుకు విశ్రాంతి కలిగించేలా కంకర, గులక రాళ్లు, ఇసుక, మట్టి, నీటితో కూడిన నడక బాటలను నిర్మించారు. వీటి మీద నడవడం ద్వారా కలిగే ప్రయోజనాలు తెలిసేలా పార్కులో బోర్డును సైతం ఏర్పాటు చేశారు. ‘ఆక్యుప్రెషర్’ బాటపై నడిచేందుకు ఉదయం నడకకు వచ్చే వారు ఆసక్తి చూపుతున్నారని బొటానికల్ గార్డెన్ నిర్వాహకులు తెలిపారు.
ఆక్యుప్రెషర్ విధానంలో శరీరంలో వివిధ అవయవాలకు ఒత్తిడి కలిగి మనసుకు విశ్రాంతి లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. ఒత్తిడి తగ్గడం వల్ల రోజువారి జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుందని చెప్పారు.