కార్పొరేట్ సంస్థలకు సాయం చేయడానికే... రైతులను కేంద్రప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సెల్యూట్ చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు బంద్‌లో పాల్గొని విజయవంతం చేశారన్నారు. తెరాస పార్టీ బంద్‌లో పాల్గొనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
రైతుల సమస్యలను రాష్ట్ర సర్కారు ఎందుకు పట్టించుకోవడం లేదని ఉత్తమ్ ప్రశ్నించారు. సన్న రకాల వడ్లు, పత్తి, జొన్నలకు మద్దతు ధర ఇవ్వలేదన్న ఉత్తమ్... రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదో చెప్పాలని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి మద్దతు ధర ప్రకటించాలని... ఆ తరువాత సమస్యల గురించి మాట్లాడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
రేపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా కార్యకర్తలు ఉత్సవాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. దేశ వ్యాప్తంగా రైతుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ఉత్సవాలకు దూరంగా ఉండాలని సూచించారు. సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్బంగా పేదలకు ఆర్థిక, ఆర్థికేతర సాయం అందించాలని ఉత్తమ్ కోరారు.
ఇదీ చూడండి: రైతన్నకు మద్దతుగా నిలిచిన రాష్ట్రం.. భారత్ బంద్ సంపూర్ణం