హైదరాబాద్ నగరంలో వరద నీటితో ఇబ్బంది పడుతున్న కాలనీలపై ప్రత్యేక దృష్టిసారించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.
రెండు నెలల నుంచి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలుకాలనీల్లో వరదనీటిలో వేయి ఇల్లు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మాన్ నగర్, సయిఫ్ నగర్, అబ్దుల్లా యహియా నగర్ వాసుల బాధలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.
నిత్యవసర సరకులు, టీవీ, రిఫ్రిజిరేటర్, కంప్యూటర్లు, పిల్లల పుస్తకాలు, బెడ్స్, చెక్క వస్తువులు, ఇల్లు పూర్తిగా పాడయ్యాయన్నారు. ప్రజలను ఆదుకోవడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు రాలేదని ఆరోపించారు. హైదరాబాద్‌కు కూత వేటు దూరంలో ఉన్న.. అదీ ఓ మంత్రి నియోజకవర్గంలోనే ఇప్పటికీ పరిస్థితి దారుణంగానే ఉందని మండిపడ్డారు. ప్రభుత్వానికి నివేదికలు పంపామని.. నిధులు మంజూరవగానే పనులు చేస్తామని అధికారులు చెబుతున్నారని ఉత్తమ్ వివరించారు.
ఇప్పటికైనా యుద్ధప్రాతిపదికన ఇళ్లలో ఉన్న వరద నీటిని బయటకు పంపేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని కోరారు. వరదల భారిన పడి మరణించిన కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్