సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కరోనా జయించి హైదరాబాద్లోని ఆయన వ్యక్తిగత కార్యాలయంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కరోనా పాజిటివ్ వచ్చి 15 రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. చికిత్స అనంతరం నాలుగు రోజుల క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జయ్యారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే తనకు కరోనా రావడం పెద్ద విషయం కాదని... ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని ఎమ్మెల్యే తెలిపారు.
నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై త్వరలోనే అధికారులతో సమీక్షించనున్నట్టు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజలందరూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. కరోనా విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని... రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక ఆసుపత్రి స్థాయి నుంచి కరోనా చికిత్సకి సంబంధించి ఏర్పాట్లు చేసిందన్నారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులందరూ... సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.