డ్రైవింగ్ లైసెన్స్ నవీకరణ, చిరునామా మార్పు, లెర్నర్ లైసెన్స్‌లో వాహన స్థాయి మార్పులు.. ఇలాంటి 17 రకాల సేవల కోసం ఇక రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచైనా, ఏ సమయంలోనైనా పొందవచ్చు. రాష్ట్ర రవాణా శాఖ మొత్తం 59 రకాల సేవలను ఆన్‌లైన్ ద్వారా అందిస్తోంది. తొలుత ఆన్‌లైన్ ద్వారా సమయం (స్లాట్) తీసుకుని.. ఆయా రవాణా శాఖ కార్యాలయాలకు నిర్ధారిత సమయాల్లో హాజరు కావాల్సి ఉంటుంది. దీనివల్ల దరఖాస్తుదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో 17 రకాల సేవల కోసం కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా ఎక్కడి నుంచైనా - ఏ సమయంలోనైనా (ఎనీ వేర్- ఎనీ టైమ్) పథకం కింద ఆన్‌లైన్ ద్వారానే పత్రాలు పొందేందుకు రవాణా శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకు అవసరమైన అన్ని రకాల ధ్రువపత్రాలను ఆన్‌లైన్ ద్వారా అప్‌లోడ్ చేసి నిర్ధారిత ఫీజులను చెల్లిస్తే సరిపోతుందని రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు తెలిపారు. ధ్రువపత్రాలను పరిశీలించిన అనంతరం అన్నీ సక్రమంగా ఉంటే దరఖాస్తుదారులకు ఆయా ధ్రువపత్రాలను ఆన్‌లైన్ ద్వారా పంపుతారు. మరిన్ని సేవలను ఎక్కడ నుంచైనా - ఏ సమయంలోనైనా పథకం పరిధిలోకి తీసుకువచ్చేందుకు యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆ సేవలివే...
- గడువు తీరిన డ్రైవింగ్ లైసెన్స్ నవీకరణ
- డ్రైవింగ్ లైసెన్సులో చిరునామా మార్పు
- గడువు తీరిన డ్రైవింగ్ లైసెన్స్ స్థానంలో ప్రాథమిక దశ (లెర్నర్) లైసెన్స్
- లెర్నర్ లైసెన్స్‌లో వాహన స్థాయి మార్పులు
- గడువు తీరిన లెర్నర్ లైసెన్స్ మళ్లీ జారీ
- ప్రమాదకర వాహనాల లైసెన్స్
- వాహన రిజిస్ట్రేషన్ ధ్రువపత్రంలో చిరునామా మార్పు
- రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వాహనం బదిలీ
- కొన్ని రకాల వాహనాలకు నూతన పర్మిట్ పొందడం, పర్మిట్ పునరుద్ధరణ, తాత్కాలిక, ప్రత్యేక పర్మిట్, డూప్లికేట్ పర్మిట్ల జారీ
- డైవింగ్ లైసెన్స్, లెర్నర్ లైసెన్స్ నకలు (డూప్లికేట్) కాపీ
- వాణిజ్య వాహనాలు నడిపేందుకు వీలుగా బ్యాడ్జీ
- లైసెన్స్ స్థానంలో స్మార్ట్‌కార్డు
- లైసెన్స్ వివరాల (హిస్టరీ షీట్) సేవలు