ఏపీలోని కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పుణ్యక్షేత్రం ప్రసిద్ధి చెందింది. దేశం నలుమూలల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. అయితే ఈ మఠం 11వ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి గత నెల 8న శివైక్యం చెందారు. ఆయన తదనంతరం మఠాధిపతి ఎవరు ఉండాలనే దానిపై కుటుంబంలో వివాదం నడుస్తోంది.
దివంగత వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య చంద్రావతమ్మ 15 ఏళ్ల క్రితం చనిపోయారు. ఆ తర్వాత మారుతీ మహాలక్ష్మమ్మను రెండో వివాహం చేసుకున్నారు. మొదటి భార్యకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామికి వేదాలు, ఉపనిషత్తులు తెలుసనే కారణంతో తనకు పీఠాధిపత్యం దక్కాలని పట్టుబడుతున్నారు. అయితే తన భర్త చనిపోవడానికి ముందే తన కుమారుడి పేరిట పీఠాధిపత్యంపై వీలునామా రాసినట్లు రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ చెబుతున్నారు. పీఠాధిపత్యం కోసం కోర్టులో తేల్చుకోవడానికైనా సిద్ధమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
పీఠాధిపత్యం వివాదం పరిష్కరించడానికి.. తెలుగు రాష్ట్రాల్లోని 12 మంది శైవక్షేత్ర పీఠాధిపతులు నేడు బ్రహ్మంగారి మఠానికి రానున్నారు. కుటుంబ సభ్యులతో చర్చించి పీఠాధిపత్యంపై ఓ అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులను ఒప్పించిన తర్వాత దేవాదాయశాఖ ఆధ్వర్యంలో పీఠాధిపత్యంపై నిర్ణయం తీసుకునే వీలుంది.
ఇవీచూడండి: KCR: గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళి