క్షవరం చేయించుకోవాలంటే సెలూన్‌కెళ్లి గంటల తరబడి నిరీక్షించడం, ఫేషియల్ చేయించుకోవాలంటే పార్లర్‌కెళ్లి కూర్చోవడం.. పాత ముచ్చట. యాప్ తెరిస్తే చాలు ఇంటికే వచ్చి అవన్నీ చేసి వెళతారు. సమయం ఆదా. బయటికెళ్లి రావడానికి పెట్రోలు ఖర్చు కలిసొస్తుంది. పైగా ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా. హౌస్‌జాయ్ సంస్థ టాన్ క్లియర్ ఫేషియల్ వంటి వాటికి రెండు సర్వీసులకు(home cleaning services apps) రుసుము చెల్లిస్తే మూడో సర్వీసు ఉచితంగా అందిస్తోంది.
ఇంట్లో పైపు లీకయినా, ఫ్యాన్ పాడయినా, ఏసీ మొరాయించినా..గ్యాస్ స్టవ్ వెలగకపోయినా హైరానా పడే పనే లేదు. యాప్‌లో ఒక్క క్లిక్‌తో మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సెల్‌ఫోన్‌లో ఒక్క మీట నొక్కితే చాలు ఇంట్లో వివిధ మరమ్మతులు సహా వందల రకాల సేవల్ని ఇంటి ముంగిటకే వచ్చి అందిస్తున్న ‘ఆన్ డిమాండ్ హోమ్ సర్వీసెస్ యాప్(home services apps)’లదే ఇప్పుడు హవా. వినియోగదారులు కోరుకున్న సమయంలో అందుబాటు ధరల్లో సేవలు అందిస్తుండటంతో వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. అర్బన్ కంపెనీ, హౌస్‌జాయ్, హెల్ప్‌ఆర్, ఎస్‌బ్రిక్స్, మిస్టర్‌రైట్, టైమ్‌సేవర్‌జెడ్ తదితర సంస్థలు ప్రధాన నగరాల్లో విస్తృతంగా ఈ సేవలందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌లో ఇలాంటి సేవలు ఇప్పటికే జోరందుకోగా.. విజయవాడ, విశాఖపట్నం వంటి చోట్ల ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయి. కొవిడ్ తర్వాత ఈ తరహా సేవలకు డిమాండ్ పెరిగింది.
రాయితీలు, ఆఫర్లతో సందడి
ఇంటి వద్దకు వచ్చి సేవలు అందించినా ఆయా సంస్థలు వసూలు చేసే రుసుములు అందుబాటులోనే ఉంటుండటం దీనిలో ప్రత్యేకత. అర్బన్ కంపెనీ స్ల్పిట్ ఏసీ రెగ్యులర్ సర్వీసెస్‌కు రూ.699 వసూలు చేస్తోంది. రూ.199కే పురుషుల హెయిర్ కటింగ్ చేస్తోంది. హౌస్ జాయ్ సంస్థ ఏసీ గ్యాస్ రీ ఫిల్లింగ్‌కు రూ.2,200, డ్రై సర్వీసింగ్‌కు రూ.400, వెట్ సర్వీసింగ్‌కు రూ.499 రుసుము వసూలు చేస్తోంది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు రాయితీలూ ప్రకటిస్తున్నాయి. ఏడాదిలో మూడుసార్లు వంటగది మొత్తం శుభ్రం చేసే (కిచెన్ డీప్ క్లీనింగ్) ప్యాకేజీని ఎంపిక చేసుకుంటే హౌస్‌జాయ్ సంస్థ 20% రాయితీ ఇస్తోంది. తొలిసారి సేవలు పొందేవారికి కొన్ని సంస్థలు వెల్‌కమ్ ఆఫర్లు ఇస్తున్నాయి. క్రెడిట్‌కార్డుతో చెల్లిస్తే 10-20 శాతం రాయితీ కల్పిస్తున్నాయి. పలు సంస్థలు తాము అందించే సేవలపై 30 రోజుల వారంటీ కూడా అందిస్తున్నాయి. కొన్ని సంస్థలైతే తమ పనితీరుతో వినియోగదారుడు సంతృప్తి చెందకపోతే ఎలాంటి అదనపు రుసుము తీసుకోకుండానే మళ్లీ ఆ పని చేస్తాయి. మరమ్మతులు, క్లీనింగ్ చేసేటప్పుడు వస్తువుకు ఏదైనా నష్టం జరిగితే డ్యామేజీ కింద కొన్ని సంస్థలు రూ.10 వేల వరకూ చెల్లిస్తున్నాయి.
అనుసంధాన వారధి
కొంతమంది చిన్న చిన్న పనుల కోసం పదే పదే తిరుగుతూ కాలం వెచ్చించలేరు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నవారికి ఇది మరీ ఇబ్బంది. మరోవైపు నైపుణ్యం ఉన్నా పని ఇచ్చేవారు ఎవరో తెలియక ఇబ్బంది పడే పనివారు మరికొందరు. ఇలాంటి వినియోగదారులకు, సేవలందించేవారికి మధ్య అనుసంధాన వారధిగా పనిచేస్తూ వారి అవసరాలు తీర్చటంలో ఈ యాప్‌లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. పనులు చేసేవారి నేపథ్యాన్ని పూర్తిగా పరిశీలించాకే ఎంపిక చేసుకుంటాయి. పక్కాగా శిక్షణ ఇచ్చాకే తమ వేదికల ద్వారా పనులు కల్పిస్తున్నాయి.
విలాసం కాదు.. అవసరం
ఇంటి వద్దకే సేవలంటే ఒకప్పుడు విలాసం. ఇప్పుడు అవసరంగా మారుతున్నాయి. లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి అర్బన్ కంపెనీకి 33% కొత్త వినియోగదారులు వచ్చారు. కొవిడ్ కంటే ముందు బ్యూటీ, పర్సనల్ కేర్, రిపేర్ వంటి సేవలకు డిమాండు ఉండేది. కొవిడ్ తర్వాత హోమ్ క్లీనింగ్, డిస్ ఇన్‌ఫెక్షన్ సేవలకు గిరాకీ పెరిగింది.
వందల రకాల సేవలు
- ‘ఆన్ డిమాండ్ హోమ్ సర్వీసెస్ యాప్‌లు(home cleaning services apps)’ ప్రధానంగా ఇంటిని శుభ్రపరచటం, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, చెదల నివారణ, కార్పెంటరీ, ఏసీ సర్వీసు- రిపేరు, విద్యుత్ ఉపకరణాల మరమ్మతులు, పెయింటింగ్, హోమ్ సెలూన్, కార్ వాష్, లాండ్రీ, ఫర్నిచర్ అసెంబ్లింగ్ తదితర విభాగాల్లో సేవలు అందిస్తున్నాయి. వీటిలో పలు ఉపవిభాగాలూ ఉన్నాయి.
- ఇల్లు మొత్తం పూర్తిగా శుభ్రపరచటం (డీప్ క్లీనింగ్), వంటగది, పడకగది, బాత్‌రూమ్ ఇలా ఏదో ఒక గది మాత్రమే శుభ్రపరచటం.
- గీజర్, వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్ వంటి పరికరాల మరమ్మతులు, ఏసీ గ్యాస్ రీఫిల్, డ్రై సర్వీసింగ్, వెట్ సర్వీసింగ్, రిపేర్
- మహిళలు, పురుషులకు వేర్వేరుగా హోమ్ సెలూన్.ఇలా ఈ యాప్‌లు వందల సేవలు అందిస్తున్నాయి. ఏం చేస్తారు? ఎంత ఛార్జీ చేస్తారు? ఎంత సమయం పడుతుందన్నదానిపైనా ఆ సంస్థలు వాటి వెబ్‌సైట్లు, యాప్‌ల్లో వివరాలు పొందుపరుస్తున్నాయి. ఎలా చేస్తారో వర్కింగ్ వీడియోల్ని అందుబాటులో ఉంచుతున్నాయి.