NTR University name changed Protests in Hyderabad: ఏపీలోని వైకాపా ప్రభుత్వం విజయవాడలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడంపై హైదరాబాద్ లో ఎన్టీఆర్ అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్ లోని కమ్మసేవాసమితి ఆధ్వర్యంలో సుమారు 100 మందికిపైగా ఎన్టీఆర్ అభిమానులు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎన్టీఆర్ పేరు తొలగించే హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదన్న వారు.... పేరు మార్పుపై తక్షణం పునరాలోచించుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే... రోజుకో రీతిలో నిరసన వ్యక్తం చేస్తామని ఎన్టీఆర్ అభిమానులు వెల్లడించారు.
అసలేం జరిగింది.. ఏపీ రాష్ట్రంలో ఎంతో కీలకమైన విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చేందుకు రాత్రికి రాత్రే ఆన్‌లైన్‌లో ఆమోదించింది కేబినెట్. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్పు చేస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం సవరణ బిల్లు ప్రవేశపెట్టింది. వైఎస్‌కు ఏ సంబంధమూ లేకున్నా ఆయన పేరు పెట్టాలని జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిని ఏర్పాటు చేసింది ఎన్టీఆర్ అని, దీనికి గుర్తింపు తీసుకొచ్చిందీ ఎన్టీఆర్ అని అంటున్నారు. ఇప్పుడు ఆయన పేరుకే వైసీపీ సర్కారు మంగళం పాడింది. ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ పేరు పెట్టేందుకు రాత్రికి రాత్రే చకచకా ఏర్పాట్లును వైకాపా ప్రభుత్వం చేసింది.
వైద్య వర్సిటీతో ఎన్టీఆర్‌కు ఉన్న బంధం.. వైద్య వర్సిటీతో ఎన్టీఆర్‌కు బలమైన బంధం ఉంది. వర్సిటీ ఏర్పాటు నుంచి జాతీయ స్థాయి గుర్తింపు వరకు ఆయన కృషి ఉంది. మరణానంతరం తర్వాత పాలకులు వర్సిటీకి ఆయన పేరు పెట్టారు. సీఎంలు మారినా 24 ఏళ్లుగా అదే కీర్తి కొనసాగుతోంది. అప్పట్లో రాష్ట్రంలోని వైద్య కళాశాలలన్నీ ఆయా జిల్లాల్లోని విశ్వవిద్యాలయాల పరిధిలో ఉండేవి. వాటి ద్వారానే విద్యార్థులకు డిగ్రీల అందజేసేవారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా.. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలని నిర్ణయించారు. దీంతో 1986 నవంబర్ 1న ఏపీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరిట ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో 1996 జనవరి 8న ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా విశ్వవిద్యాలయం పేరు ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీగా మార్చారు. వైఎస్ హయాంలో 'డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం'గా పేరు మార్చారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మర్చేసింది.
ఇవీ చదవండి: