Chicken Recipes: చికెన్ అంటే మాంసాహార ప్రియులకు యమ ఇష్టం. అందులోనూ ఇది వీకెండ్. అందరికీ చికెన్ కర్రీ, బిర్యానీ, డ్రమ్‌స్టిక్స్ తెలిసే ఉంటాయి. వీకెండ్‌ను మంచి ఫుడ్‌తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా!. అయితే... ఈసారి కూరకు బదులు చికెన్‌తో ఈ చిరుతిళ్లు చేసి చూడండి. మీ పిల్లల ముఖాలు వెలిగిపోకపోతే చూడండి. నోరూరించే చికెన్ చిరుతిళ్లు తయారు చేసుకోండిలా..
నగ్గెట్స్..
కావాల్సినవి: బోన్‌లెస్ చికెన్- పావుకిలో, వెల్లుల్లి పేస్ట్- చెంచా, మిరియాల పొడి- అరచెంచా, మైదా- కప్పు, కారం- చెంచాన్నర, బ్రెడ్‌క్రంబ్స్- కప్పున్నర, పెరుగు- అరకప్పు, అల్లంపేస్ట్- చెంచా, ఉప్పు- తగినంత, గుడ్లు- రెండు, మిక్స్డ్‌హెర్బ్ పౌడర్- చెంచా, నూనె- వేయించడానికి తగినంత, గార్లిక్ పౌడర్- అరచెంచా.
తయారీ: ఒక గిన్నెలో పెరుగు తీసుకుని అందులో ఉప్పు, మిరియాలపొడి, అల్లం, వెల్లుల్లిపేస్ట్, చెంచా కారం వేసి బాగా కలిపి, శుభ్రం చేసిన చికెన్‌ని వేసి ఫ్రిజ్‌లో గంటన్నరపాటు ఉంచాలి. ఈలోపు మూడు వేర్వేరు పాత్రలు తీసుకుని ఒకదానిలో గిలక్కొట్టిన గుడ్లసొన తీసుకోవాలి. మరొకదానిలో మైదా తీసుకుని దానిలో ఉప్పు, గార్లిక్ పౌడర్, అరచెంచా కారం, మిక్స్డ్‌హెర్బ్ పౌడర్ వేసి కొద్దిగా నీళ్లతో కలిపిపెట్టుకోవాలి. మరొక గిన్నెలో బ్రెడ్ క్రంబ్స్ పొడి వేసుకోవాలి. చికెన్ ముక్కలని ముందుగా గిలక్కొట్టిన గుడ్డు సొనలో ముంచి తర్వాత మైదాలో ఆ తర్వాత బ్రెడ్‌పొడిలో దొర్లించాలి. వీటిని నూనెలో వేయించుకోవాలి. కరకరలాడే చికెన్ నగ్గెట్స్‌ని పిల్లలు ఇష్టంగా తింటారు.
స్ప్రింగ్‌రోల్స్...
కావాల్సినవి: చిన్నముక్కలుగా తరిగిన చికెన్- అర కప్పు, స్ప్రింగ్‌రోల్ ర్యాపర్లు- ఆరు, నూనె- తగినంత, సన్నగా తరిగిన అల్లం- చెంచా, వెల్లుల్లి పలుకులు- చెంచా, సన్నగా తరిగిన క్యాబేజీ- పావుకప్పు, క్యారెట్ తురుము- పావుకప్పు, సోయాసాస్- చెంచా, ఉప్పు- రుచికి తగినంత, మిరియాలపొడి- చెంచా, ఉల్లికాడలు- రెండు, వెనిగర్- చెంచా, చిల్లీఫ్లేక్స్- చెంచా, రోల్స్‌ని అతికించడానికి- కొద్దిగా కార్న్‌ఫ్లోర్ నీళ్లు కలిపినది.
తయారీ: నాన్‌స్టిక్ పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనెపోసి... క్యారెట్, క్యాబేజీ తరుగు వేసి వేయించుకోవాలి. తర్వాత చికెన్ ముక్కలు, సోయాసాస్, ఉప్పు, మిరియాలపొడి, చిల్లీఫ్లేక్స్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. చివరిగా ఉల్లిపొరక కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్ప్రింగ్‌రోల్ షీట్లు తీసుకుని వాటిల్లో వేయించిన మిక్చర్‌ని ఉంచి రోల్ మాదిరిగా చుట్టి కార్న్‌ఫ్లోర్ పేస్ట్‌తో అన్నివైపులా గట్టిగా అతికించుకోవాలి. ఇప్పుడు వాటిని నూనెలో వేయించుకుంటే స్ప్రింగ్‌రోల్స్ సిద్ధం.
పకోడి
కావాల్సినవి: బోన్‌లెన్ చికెన్- అరకిలో, అల్లం తరుగు- చెంచా, పచ్చిమిర్చి- రెండు, జీలకర్రపొడి- చెంచా, ధనియాలపొడి- చెంచా, కొత్తిమీర తరుగు- చెంచా, కారం- చెంచా, నూనె- వేయించడానికి సరిపడ, ఉప్పు- తగినంత, శనగపిండి- 100గ్రా, మొక్కజొన్నపిండి- చెంచా, వంట సోడా- పావుచెంచా, నీళ్లు- సరిపడ.
తయారీ: ఒకపాత్రలో తగిన పరిమాణంలో తరిగిన చికెన్ ముక్కలు, అల్లం తరుగు, పచ్చిమిర్చి, ముక్కలు, ఉప్పు, జీలకర్రపొడి, ధనియాలపొడి, కారం వేసి బాగా కలిపి అరగంట ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తర్వాత దీనిపై తగినంత ఉప్పు, శనగపిండి, మొక్కజొన్నపిండి, వంటసోడా వేసి తగినన్ని నీళ్లు వేసి కలుపుకోవాలి. ఒక కడాయిలో తగినంత నూనె తీసుకుని పకోడీలా మాదిరిగా వేయించుకోవడమే.
కబాబ్స్
కావాల్సినవి: బోన్‌లెస్ చికెన్- పావుకిలో, పెరుగు- మూడు చెంచాలు, నూనె- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, నిమ్మరసం- చెంచాన్నర, అల్లంవెల్లుల్లి పేస్ట్- ఒకటిన్నర చెంచా, గరంమసాలా- చెంచా, కారం- చెంచా, ఉల్లిపాయ- ఒకటి, క్యాప్సికం- ఒకటి.
తయారీ: ఉల్లిపాయ, క్యాప్సికమ్‌ని పెద్ద ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి. వీటితోపాటు ఒక పాత్రలో పైన చెప్పిన అన్నింటిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో కనీసం నాలుగు గంటలపాటైనా ఉంచాలి. తర్వాత కబాబ్స్ స్క్యూయర్స్(మార్కెట్లో దొరుకుతాయి)కి చికెన్, ఉల్లిపాయముక్కలు, క్యాప్సికం ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి గుచ్చి గ్రిల్‌పై అన్నివైపులా కాల్చుకోవాలి. ఇష్టమున్నవారు పైన బటర్ రాసుకుంటే బాగుంటుంది. సన్నసెగమీద పావుగంటపాటు కాలిస్తే ముక్క ఉడికి రుచిగా ఉంటుంది.
మోమో
కావాల్సినవి: మైదా- 400గ్రా, నూనె- చెంచా, ఉల్లిపాయ- ఒకటి, అల్లం- చిన్నముక్క, నీళ్లు- తగినన్ని, అల్లంవెల్లుల్లి పేస్ట్- చెంచా, ఉడికించిన బోన్‌లెస్ చికెన్-300గ్రా, పచ్చిమిర్చి-ఆరు, ఉప్పు- తగినంత, సోయాసాస్- రెండు చెంచాలు, మిరియాలపొడి- అరచెంచా, కారం- చెంచా
తయారీ: బోన్‌లెస్ చికెన్‌ని కొద్దిగా ఉప్పు, మిరియాలపొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఉడికించి.. చిన్నముక్కలుగా చేసుకోవాలి. అలాగే మైదాలో నూనె, ఉప్పు వేసుకుని చపాతీపిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని మోమోల సైజ్‌ని బట్టి చిన్నచిన్న చపాతీల్లా చేసి పెట్టుకోవాలి. ఒక పాత్రలో ఉడికించిన చికెన్ తీసుకుని దీనిలో ఉల్లిపాయముక్కలు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, కారం, తగినంత ఉప్పు, సోయాసాస్, మిగిలిన మిరియాలపొడి, అల్లంవెల్లుల్లిపేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడీ మిశ్రమాన్ని... చపాతీల్లా ఒత్తుకున్న వాటిల్లో కొద్దిగా ఉంచి అంచులని మూసేయాలి. వీటిని ఇడ్లీ పాత్రలో పెట్టి 20 నిమిషాలు ఉడికిస్తే వేడివేడి మోమోలు సిద్ధమవుతాయి.
ఇవీ చూడండి: