రాష్ట్ర రాజధానిలో శబ్ద కాలుష్యం(Noise pollution) మోతమోగుతోంది. దీనివల్ల అనేక రకాలైన సమస్యలు ఏర్పడుతున్నాయంటూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా శబ్ద కాలుష్యం పెరుగుదలపై పరిశీలన చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నగర పరిధిలో అనేక ప్రాంతాల్లో దీనికి సంబంధించి పరిణామాలను ప్రత్యేక పరికరాల ద్వారా లెక్కించింది. అన్ని చోట్ల పెరుగుతోందని తేల్చింది. ఈ మేరకు నివేదికలోని వివరాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో సోమవారం వెల్లడించింది.
రోడ్లపై నిత్యం 50 లక్షల నుంచి 60 లక్షల వాహనాలు తిరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలను అధికారులు నియంత్రించాల్సి ఉంది. కాలం తీరిన వాహనాలను నియంత్రించడంలో అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు. ఆర్టీసీకి చెందిన దాదాపు వెయ్యి డొక్కు బస్సులు, వేలాది పాత రవాణా వాహనాలు, కార్లు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. వీటి వల్ల పెద్దఎత్తున శబ్ద కాలుష్యం(Noise pollution) వెలువడుతోంది.
ఎక్కడెక్కడ ఎలా ఉంది..
సున్నిత ప్రాంతాలైన జూపార్క్, గచ్చిబౌలిలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. జూపార్క్ దగ్గర నిర్దేశిత పరిమితుల కంటే పగటిపూట అధిక శబ్దం నమోదైంది. ఇక్కడ పగటిపూట 50 డిసిబుల్స్ ఉండాలి కానీ 69 శాతం ఉంది. రాత్రిపూట 45 డిసిబుల్స్ ఉండాల్సి ఉండగా 68.1 శాతం ఉంది. నివాస ప్రాంతాలైన జూబ్లీహిల్స్, తార్నాకలో మోత(Noise pollution) మోగుతోంది. అబిడ్స్‌లో నిర్దేశిత పరిమితుల కంటే అధికంగా నమోదయ్యింది.
అనారోగ్య సమస్యలు..
శబ్ద కాలుష్యం(Noise pollution).. చిరాకు, ఆందోళనకు కారణమవుతుంది. ఈ వాతావరణంలో ఎక్కువసేపు ఉంటే రక్తపోటు పెరగడం, శాశ్వత వినికిడి లోపం, మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరుకుల్ని మోసుకొచ్చే భారీ వాహనాలు, ట్రావెల్స్ బస్సుల రాకపోకలు రాత్రిపూటే ఎక్కువగా ఉంటాయి. వీటి హారన్ల మోతతోనే శబ్ద కాలుష్యం ఎక్కువగా నమోదవుతున్నట్లు పీసీబీ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
ఈ ఏడాది కూడా..: ఈ ఏడాది కూడా నగరంలో శబ్ద కాలుష్యం(Noise pollution) ప్రమాదకరంగానే ఉందని, కొవిడ్ వల్ల రెండు నెలలు మెరుగ్గా ఉన్నా తరువాత దారుణంగా మారిందని అధికారులు చెబుతున్నారు.
కనిపించని ముప్పు..
కంటికి కనిపించని ముప్పు ముంచుకొస్తుంది. గాలి పీల్చగానే నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడే స్థిరపడి అనారోగ్య సమస్యలకు కారణమయ్యే అతి సూక్ష్మ ధూళి కణాలు(పీఎం 2.5) నగరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వీటి తీవ్రత కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకరంగా ఉన్నట్లు వెల్లడయ్యింది. వాహనాలు, రోడ్లు, చెత్తను కాల్చడం, నిర్మాణ పనులు తదితర కార్యకలాపాల వల్ల గాల్లోకి నిత్యం పీఎం 10, పీఎం 2.5, నైట్రోజన్ ఆక్సైడ్లు, కార్బన్‌మోనాక్సైడ్ తదితర 40 రకాల కాలుష్య ఉద్గారాలు విడుదలవుతున్నాయి. మన తలవెంట్రుక మందం 50 మైక్రోగ్రాములు ఉంటే.. అదే పీఎం 2.5 విషయానికొస్తే అందులో 20 రేట్లు తక్కువగా ఉంటుంది. అత్యంత ప్రమాదకరమైనది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) నిర్దేశిత పరిమితుల ప్రకారం ఘనపు మీటర్ గాలిలో దీని తీవ్రత 40 మైక్రోగ్రాములు మించరాదు.
ఒక్క ప్యారడైజ్‌లో మినహా..
నగరంలో పలు ప్రాంతాల్లోని పీసీబీ కాలుష్య నమోదు కేంద్రాల్లో ఈ ఏడాదిలో ఇప్పటివరకు పీఎం 2.5 తీవ్రత ఎలా ఉందంటూ లెక్క తీయగా.. చాలాచోట్ల నిర్దేశిత మార్కు కంటే అధికంగా నమోదైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అత్యధికంగా సనత్‌నగర్‌లో 77 ఎంజీలు నమోదైనట్లు గుర్తించారు. జూపార్క్ దగ్గర 72 ఎంజీలు, హెచ్‌సీయూ, జీడిమెట్లలో 51 ఎంజీలు, ప్యారడైజ్‌లో 39 ఎంజీలుగా ఉంది.
ప్లస్‌ఐక్యూ ఎయిర్ అధ్యయనంలో..
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో పీఎం 2.5 తీవ్రతపై ప్లస్‌ఐక్యూ ఎయిర్ అనే సంస్థ అధ్యయనం చేసింది. 2020లో బెంగళూరు, చెన్నై కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అత్యధికంగా డిసెంబర్‌లో 57.8 ఎంజీలు నమోదైనట్లు గుర్తించారు.