గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఎలాంటి వ్యాధి లక్షణాలు లేని వారు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 84 శాతం మందికి లక్షణాలు లేవని వైద్యఆరోగ్య శాఖ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. ఈ నెల 10 వరకు 22 వేల 628 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా... 15 వేల 554 మంది హోం ఐషోలేషన్లోనే ఉన్నారు. ఇందులో గ్రేటర్ పరిధిలోని వారే ఎక్కువగా ఉన్నారు. ఎలాంటి లక్షణాలు లేకున్నా చిన్న పిల్లలు, వృద్ధులు, గుండె, ఊపిరితిత్తుల, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఆసుపత్రుల్లో చేరాలని ప్రభుత్వం చెబుతోంది. అయితే హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి టాబ్లెట్స్, మాస్కులు, శానిటైజర్‌తో కూడిన హోం ఐసోలేషన్ కిట్ జీహెచ్ఎంసీ అందిస్తోంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాయంలో కరోనా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వారి ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ... సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం వారికి సూచనలు సలహాలు ఇవ్వాలి. అత్యవర సమయంలో కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసినపుడు వెంటనే స్పందించి వారికి వైద్య సేవలు అందిస్తున్నామని జీహెచ్ఎంసీ చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం హోం ఐసోలేషన్‌లో ఉంటున్న కరోనా రోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
ప్రైవేటు పైనే భారం..
గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా వైరస్ బాధితులకు సమస్యలు తప్పడం లేదు. టెస్ట్ చేయించుకున్నప్పటి నుంచి కొలుకునే వరకు చాలా ఇబ్బందికరంగా ఉంటోందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. నగరంలో చాలా ప్రాంతాల్లో వైరస్ నిర్ధరణయ్యాక... బాధితుడి నివాసానికి వెళ్లి పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు. అంతే తప్ప ఎలాంటి సాయం చేయడం లేదని బాధితులు వాపోతున్నారు. బాధితులు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేస్తే పది రోజుల తర్వాత... వ్యాధి తగ్గాక జీహెచ్ఎంసీ సిబ్బంది కిట్స్ అందిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటి వరకు బాధితుడు ఎలాంటి మందులు వేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఎవరూ చెప్పడం లేదంటున్నారు. దీంతో మిగతా కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ కిట్ ఇచ్చేంత వరకు ఎదురుచూడకుండా తామే ప్రైవేటుగా మందులు తెచ్చుకుంటున్నామని చెబుతున్నారు.
పకడ్బందీగా లేకనే..
వైరస్ సోకిందని నిర్ధరణ అయినప్పటి నుంచి కోలుకునే వరకు బాధితులను జీహెచ్ఎంసీ సిబ్బంది తరచూ పరామర్శిస్తూ... బాగోగులు తెలుసుకుంటూ, ఆరోగ్య సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రారంభంలో బాగానే పని చేసినా... ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడ కనబడటంలేదు. నగరంలో పలువురుని క్షేత్రస్థాయిలో పరిశీలించగా... విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఇంటి పరిసరాలను శుభ్రం చేయాల్సిన పారిశుద్ధ్య కార్మికులు కూడా రావడం లేదు. ఇక కరోనా రోగులున్న ప్రాంతాలను కంటైన్మెంట్ చేస్తున్నట్టు బులిటెన్‌లో వెల్లడిస్తున్న ప్రభుత్వం... క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. కేవలం కేంద్ర బృందం, సీఎస్, ఇతర ఉన్నతాధికారులు పర్యటించే సమయంలో మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. కంటైన్మెంట్ పకడబ్బందిగా లేక పోవడం వల్లనే కేసుల తీవ్రత ఎక్కువ అవుతున్నాయంటున్నారు.
ఇప్పుడిప్పుడే ముందుకొస్తున్నారు..
హోం ఐసోలేషన్‌లో ఉంటున్న రోగులను జీహెచ్ఎంసీ పట్టించుకోకపోవడం వల్ల... కొందరు ప్రైవేటు ఆసుపత్రుల‌్లో చికిత్స పొందుతున్నారు. నిరంతరం వైద్యుల పర్యవేక్షణతో పాటు... ఇతర సూచనలు చేస్తున్నారు. గత నెలలో తన భర్తకు పాజిటివ్ వచ్చిన తర్వాత... అత్త, మామకు సోకిందని... కానీ ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదని గచ్చిబౌలికి చెందిన ఓ మహిళ ఆవేద వ్యక్తం చేశారు. మొదట్లో కరోనా వచ్చిన వారిని చుట్టుపక్కల వారు చాలా ఇబ్బందిగా చూశారు... కానీ ఇప్పుడు నగరవాసుల్లో అవగాహన వచ్చి సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారని చెబుతున్నారు.
ఇదీచూడండి: నేడు కొవిడ్ వ్యాక్సిన్ నిపుణుల కమిటీ భేటీ