School management funds : రాష్ట్రంలో పాఠశాలలను, కళాశాలలను తెరిచిన విద్యాశాఖ వాటి నిర్వహణకు అవసరమైన నిధులను ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. సమగ్ర శిక్షా అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం తన వాటా ఇస్తేనే తాము కొంత వాటాను కలిపి బడులకు విడుదల చేస్తామని ఆ శాఖవర్గాలు చెబుతున్నాయి. కేంద్ర నిధుల కోసమే ఎదురుచూస్తున్నామని పేర్కొంటున్నాయి. ఫలితంగా విద్యాసంస్థల నిర్వహణకు అవసరమైన స్టేషనరీ కొనుగోలు సమస్యగా మారింది. వేల కోట్ల రూపాయలతో బడులను అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం వాటి నిర్వహణకు అవసరమైన కొద్దిపాటి నిధులను మాత్రం సకాలంలో ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పలువురు ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు.
బడులు తెరిచి 10 రోజులైనా.. తరగతుల వారీగా హాజరుపట్టీలు(రిజిస్టర్లు), సుద్దముక్కలు(చాక్‌పీసులు), డస్టర్లు, చీపుర్లు, శౌచాలయాలను శుభ్రం చేసేందుకు ఫినాయిల్, కొత్తగా ప్రవేశాలు తీసుకునేందుకు ముద్రించిన ఫారాలు తదితర పలు వస్తువులతోపాటు పాఠశాలల్లో చిన్నచిన్న మరమ్మతులు తప్పనిసరి. అందుకోసమే బడుల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఒక్కో పాఠశాలకు విద్యా సంవత్సరానికి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు పాఠశాల విద్యాశాఖ అందించాలి.
no funds for School management : కరోనా పరిస్థితులతో సబ్బులు, హ్యాండ్‌వాష్, శానిటైజర్లను కూడా కొనుగోలు చేయాల్సి వస్తోంది. వాస్తవానికి బడుల ప్రారంభ సమయంలోనే అధికంగా ఈ నిధులు అవసరం. ఈ విద్యా సంవత్సరం విద్యాలయాలు తెరిచి 10 రోజులవుతున్నా ఇప్పటివరకు స్కూల్ గ్రాంట్ ఊసేలేదు. కనీస అవసరాలు తీర్చాలన్న ఉద్దేశంలో సొంత జేబుల నుంచి ఖర్చు చేస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు కొందరు తెలిపారు. తాను రూ.3,500లతో ఆయా వస్తువులు కొనుగోలు చేసినట్లు కరీంనగర్ జిల్లాకు చెందిన హెచ్‌ఎం ఒకరు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే... సమగ్ర శిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఆమోదం తెలిపిన నిధుల మొత్తంలో కేంద్రం 60 శాతం నిధులు ఇస్తుంది. ప్రతి ఏటా ఏప్రిల్/మే నెలలోనే ఆమోదిత గ్రాంట్‌లో 25 శాతం విడుదల చేస్తుంది. ఈసారి దాదాపు రూ.1800 కోట్లకు కేంద్ర విద్యాశాఖ ఆమోదం తెలిపింది. జూన్ నెల గడుస్తున్నా కేంద్రం మొదటి వాయిదా కింద 25 శాతం నిధులు ఇవ్వలేదు.
కేంద్రం తన వాటా ఇస్తేనే తాము తమ వాటా కలిపి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అంటే కేంద్రం ఇవ్వనంత వరకు స్కూల్ గ్రాంట్‌ను విడుదల చేసే అవకాశం లేదని తెలుస్తోంది. తమ ఉన్నతాధికారులు, ఆర్థికశాఖ అధికారులు కూడా కేంద్రంతో తరచూ సంప్రదిస్తున్నారని, తాము ఇప్పటివరకు ఏ రాష్ట్రానికి ఇంకా ఇవ్వలేదని కేంద్రం చెబుతోందని పాఠశాల విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు.
రూ.75 కోట్లు వెనక్కి తీసుకొని... రాష్ట్రంలో 25 వేల వరకు పాఠశాలలు ఉండగా...వాటికి పాఠశాల విద్యాశాఖ రెండు విడతలుగా రూ.120 కోట్ల వరకు స్కూల్ గ్రాంట్ ఇస్తోంది. 2020-21లో సగం నిధులే ఇచ్చారు. గత విద్యా సంవత్సరం(2021-22)లో చివరి విడత కింద 50 శాతం నిధులను మార్చి నెలాఖరులో ఇచ్చి..పాఠశాల విద్యా కమిటీ పేరిట గల బ్యాంకు ఖాతాల్లోని దాదాపు రూ.75 కోట్ల నిధులను ఏప్రిల్ నెలలో వెనక్కి తీసుకున్నారు. దాంతో ఆయా ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా లేకుండా పోయింది.
జూన్ 1 నుంచి బడిబాటను నిర్వహించాలని ఆదేశించిన విద్యాశాఖ ఆ కార్యక్రమం నిర్వహణకు అవసరమైన బ్యానర్లు, కరపత్రాల ముద్రణకూ ఒక్క పైసా ఇవ్వలేదు. గత నెల 13వ తేదీ నుంచి బడులు మొదలైనా స్కూల్ గ్రాంట్ ఇవ్వకుండా మిన్నకుండిపోయింది.