భారత్ బంద్‌ను వ్యతిరేకిస్తూ భాజపా శ్రేణులు పలు చోట్ల ఆందోళనకు దిగాయి. హైదరాబాద్ సరూర్‌నగర్‌లో ప్రతిపక్షాల తీరుకు నిరసనగా ప్లకార్డులు ప్రదర్శించారు. రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వనపర్తి రాజీవ్ చౌరస్తాలో భారత్ బంద్ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించాలని భాజపా నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నిర్మల్ జిల్లా బెల్ తారోడా వద్ద ఆందోళన చేపట్టిన తెరాస శ్రేణుల్ని.. భాజపా కార్యకర్తలు అడ్డుకున్నారు. కేంద్రం తెచ్చిన చట్టాలు రైతు అనుకూలంగా ఉన్నాయని వాదనకు దిగారు. పోలీసులు వచ్చి ఇరు వర్గాలను శాంతింపజేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో తెరాస, భాజపా నాయకుల మధ్య తోపులాట జరిగింది. కోరుట్ల కార్గిల్ చౌరస్తాలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తుండగా.. తెరాస శ్రేణులు ద్విచక్రవాహనాలతో ర్యాలీగా వచ్చారు. రెండు వర్గాలు పరస్పర నినాదాలతో హోరెత్తించారు. మాటామాటా పెరిగి తోపులాటకు దారి తీసింది.
భారత్ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలపడం హాస్యాస్పదంగా ఉందని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. దళారుల చేతుల్లో అన్నదాతలు మోసపోవద్దనే ప్రధాని మోదీ కొత్త చట్టాలు తీసుకొచ్చారని స్పష్టంచేశారు. కమిషన్ ఏజెంట్ల ఉద్యమానికి సీఎం కేసీఆర్ మద్దతు తెలుపుతున్నారని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ధర్నాచౌక్ ఎత్తేసిన కేసీఆర్ ఆందోళనలు చేయడమేంటని ప్రశ్నించారు.
ఇదీ చూడండి: బంద్ పూర్తిగా విఫలమైంది: బండి