MP Arvind Comments: పక్కా ప్రణాళిక ప్రకారమే తనపై దాడి జరిగిందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు. తనపై దాడిని ప్రగతిభవన్ వేదికగా మంత్రి కేటీఆర్ పర్యవేక్షించారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. రైతులెవ్వరూ తనపై దాడి చేయలేదన్నారు. రైతులకు అటువంటి మనస్తత్వం ఉండదన్నారు. ఇప్పటికే వారు ఓ లేఖ కూడా విడుదల చేశారని అ పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో ఎంపీ అరవింద్ తనపై జరిగిన దాడి వివరాలను వెల్లడించారు. దాడి చేసిన వ్యక్తి రాము అని.. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో అతడు కలిసి దిగిన ఫోటోలను ఎంపీ అర్వింద్ బయటపెట్టారు. దాడి జరిగిన స్థలంలో ఉన్న వ్యక్తుల వివరాలను, పేర్లను తెలియజేశారు.
పోలీసులు కాదు కార్యకర్తలే రక్షించారు..
"నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లో ఎంపీ ల్యాడ్స్ నిధులకు సంబంధించిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో నాపై దాడి జరిగింది. హైదరాబాద్ నుంచి వచ్చిన సుమారు 25 మంది.. స్థానికులు కొంతమంది.. తెరాస నేతలతో కలిసి మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. దాడి జరిగిన సమయంలో ఏ ఒక్క పోలీస్ అధికారి నన్ను రక్షించే ప్రయత్నం చేయలేదు. నా ప్రాణం కాపాడిన భాజపా కార్యకర్తలకు ధన్యవాదాలు. రాము అనే వ్యక్తి నాపై చాకుతో దాడి చేశాడు. నాపై జరిగిన దాడి గురించి నిజామాబాద్ కమిషనర్‌కు, ఏసీపీకి ఫిర్యాదు చేసినప్పటికి బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నిజామాబాద్ సీపీ నాగరాజు వ్యవహారం మొదటి నుంచి అనుమానాస్పదంగా ఉంది. నిజామాబాద్‌లో సీపీ నాగరాజు ఉన్నంత వరకు నా ప్రాణాలకు రక్షణ లేదు." - ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ
తనపై జరిగిన దాడి ఘటనపై.. లోక్‌సభ స్పీకర్, ప్రివిలేజ్ కమిటీకి, కేంద్ర హోం శాఖ మంత్రికి, రాష్ట్ర హోంశాఖ మంత్రికి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో భాజపా 80 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఐఏఎస్ రూల్స్ మార్పును స్వాగతిస్తున్నట్లు ఎంపీ అర్వింద్ తెలిపారు.
ఇవీ చూడండి: