ఆ యువ జంటది మంచి మనసు. తమ వివాహం సందర్భంగా విందు భోజనం ఏర్పాటు చేశారు. అయితే మనుషులకు కాదు.. మూగ జీవాలకు. అవును మూగజీవాలకే వివాహ విందు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరం హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలో మహా వీరు జైన్ మూగ జీవాల హోమ్ ఉంది. అక్కడ పశువులు, కుక్కలు, కోతులు, పక్షులు ఉన్నాయి. 20 ఏళ్లుగా ఈ కేంద్రం కొనసాగుతుంది. అయితే వాటికి తిండి సరిగా ఉండటం లేదు.
చెన్నైకి చెందిన నిఖిల్, రక్ష ఇక్కడి పరిస్థితి తెలుసుకున్నారు. తమ పెళ్లి సందర్భంగా ఏదైనా చేయాలని అనుకున్నారు. జైన్లు మూడు రోజుల పాటు వివాహ వేడుకను నిర్వహిస్తారు. దానికి కనీసం రూ.10లక్షలు ఖర్చు అవుతుంది. లాక్డౌన్ కారణంగా భారీ వేడుకలకు అనుమతి లేకపోవడంతో.. సాదాసీదాగా వేడుక చేసుకున్నారు.
ఈ సందర్భంగా మూగ జీవాలకు ఆ దంపతులు అన్ని రకాలుగా రుచి చూపించాలనుకున్నారు. మూడు రోజులపాటు జంతువుల ఆహారానికి ఖర్చయ్యే సొమ్మును మహా వీరు జైన్ మూగ జీవాల హోమ్ నిర్వాహకులకు అందజేశారు. పచ్చి గడ్డి, పుచ్చకాయలు, టమాటాలు, ఆకుకూరలు.. ఇలా 20 రకాలు పెట్టారు. దానికి సంబంధించిన వీడియో తీస్తూ ఎంతో ఆనందంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం అది నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి: Online Food : లాక్డౌన్లో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లకు గిరాకీ