New zonal system in police department: పోలీసుశాఖలో కొత్త జోన్ల కల సాకారం కాబోతోంది. ప్రభుత్వం వద్ద కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న దస్త్రానికి త్వరలోనే ఆమోదం లభించనుందని తెలిసింది. దీంతో సీఐ, ఆ కిందిస్థాయి సిబ్బంది పదోన్నతులు, బదిలీల వంటి పరిపాలనాపరమైన అంశాలు త్వరితగతిన పరిష్కారమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కొత్త జోన్లు అమల్లోకి వస్తే రాష్ట్ర పోలీసుశాఖలో అంతర్గత పరిపాలనకు సంబంధించి కొత్త శకం మొదలవుతుందని భావిస్తున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత పోలీసుశాఖలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా కొత్తగా ఏడు జోన్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఉన్న వ్యవస్థను రద్దు చేసి కొత్తగా చార్మినార్, యాదాద్రి, కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, జోగులాంబ జోన్లు ఏర్పాటయ్యాయి. ఒక్కో జోనల్‌కు ఒక్కో డీఐజీని నియమించాలని నిర్ణయించారు. ఆ జోనల్‌లో కానిస్టేబుల్ నుంచి సీఐ వరకూ పరిపాలనాపరమైన అంశాలు సంబంధిత డీఐజీ పరిధిలోనే ఉంటాయి. పోలీసుశాఖలో 90 శాతం సిబ్బంది.. సీఐ, ఆ దిగువస్థాయి పోస్టుల్లోనే ఉంటారు. వీరందరి బదిలీలు, పదోన్నతులు వంటివన్నీ డీఐజీల చేతుల్లో ఉంటాయి.
ఏటా సీనియార్టీ జాబితా తయారు చేయడం, ఖాళీలకు అనుగుణంగా పదోన్నతుల కల్పన వారి అనుమతితోనే జరగాలి. కొత్త జోన్లలో సర్వీస్ రూల్స్‌కు ప్రభుత్వం ఆమోదం తెలపకపోవడంతో ప్రస్తుతానికి ఈ జోన్లకు ఇతర అధికారులను ఇంఛార్జులుగా నియమించారు. కాళేశ్వరం జోన్‌కు రామగుండం కమిషనర్, బాసరకు నిజామాబాద్, రాజన్నకు కరీంనగర్, యాదాద్రి జోన్‌కు రాచకొండ కమిషనర్ ఇంఛార్జులుగా వ్యవహరిస్తున్నారు. విధివిధానాలు లేకపోవడంతో వీరు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడంలేదు.