రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సచివాలయం సహా ప్రభుత్వ కార్యాలయాల్లో విధుల నిర్వహణకు సంబంధించి... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు సోమవారం నుంచి జూలై 4 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. సబార్డినేట్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, నాలుగో తరగతి ఉద్యోగులు సగం మంది రొటేషన్ విధానంలో వారం రోజుల పాటు విధులకు హాజరు కావాలని తెలిపారు. క్లరికల్ స్టాఫ్, సర్క్యులేటింగ్ అధికారుల్లో సగం మంది రోజు విడిచి రోజు విధులకు హాజరు కావాలని ఆదేశించారు. విడిగా చాంబర్లు కేటాయించిన అధికారులందరూ ప్రతిరోజు విధులకు హాజరు కావాలని స్పష్టం చేశారు.
రొటేషన్ విధానంలో విధులు నిర్వర్తించే వారంతా హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాలని... అత్యవసర పనులు ఉంటే స్వల్పవ్యవధిలోనే విధులకు హాజరు కావాల్సి ఉంటుందని సీఎస్ తెలిపారు. సంబంధిత ఉన్నతాధికారి ముందస్తు అనుమతి లేకుండా సందర్శకులకు ప్రవేశం లేదని... లిఫ్టుల్లో ఆపరేటర్‌తో పాటు ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. కార్యాలయాలు, వాహనాలను ప్రతి రోజూ రసాయనాలతో పిచికారీ చేయాలని, ఉద్యోగులు, సిబ్బంది భౌతికదూరం సహా మాస్క్, వ్యక్తిగత పరిశుభ్రత విధిగా పాటించాలని తెలిపారు. కార్యాలయాల్లో ఏసీలు వినియోగించకుండా చూడాలని, గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలని సూచించారు. గర్భిణీలు, వ్యాధులు ఉన్నవారు సెలవులను ఉపయోగించుకోవాలని, వారు కూడా హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని చెప్పారు.
ఇదీ చూడండి: కరోనాకు డ్రగ్ రిలీజ్- ఒక్కో టాబ్లెట్ రూ.103