రైతులు, ప్రభుత్వం మధ్య చర్చలు ఫలప్రదంగా జరగాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల ఆదాయం పెంచేందుకు దేశ వ్యాప్త స్వేచ్ఛా మార్కెట్ రూపకల్పన, వ్యవసాయ సంబంధమైన వ్యాపారంలో గ్రామీణ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించడం, గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని పెట్టుబడులు, సృజనాత్మక కార్యకలాపాల దిశగా చొరవ తీసుకుంటున్న కేంద్రం కార్యక్రమాలు అభినందనీయమన్నారు.
హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో 'రైతు నేస్తం', 'ముప్పవరపు ఫౌండేషన్' ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ ఐవీ సుబ్బారావు పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్వర్ణభారత్ ట్రస్ట్ హైదరాబాద్ ఛాప్టర్ అధ్యక్షుడు చిగురుపాటి కృష్ణప్రసాద్, ముప్పవరపు ఫౌండేషన్ ఛైర్మన్ ముప్పవరపు హర్షవర్ధన్, రైతునేస్తం వ్యవస్థాపకులు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి పాల్గొన్నారు.
అన్నదాతకు అవార్డు..
పార్టిసిపేటరీ రూరల్ డెవలప్‌మెంట్ అధ్యక్షుడు ప్రొఫెసర్ సర్వారెడ్డి వెంకురెడ్డికి 'జీవన సాఫల్య పురస్కారం', పల్లె సృజన వ్యవస్థాపకులు బ్రిగేడియర్ పోగుల గణేశ్‌కు 'కృషిరత్న', వ్యవసాయ జర్నలిజం విభాగంలో అన్నదాత వ్యవసాయ మాసపత్రిక ఉపసంపాదకులు కస్తూరి ప్రవీణ్‌కు ఉత్తమ పాత్రికేయుడి పురస్కారాలను ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అందజేశారు. ముప్పవరపు ఫౌండేషన్ సహకారంతో 'రైతునేస్తం' నిర్వహించిన ‘పల్లెపథం’ వ్యవసాయ లఘుచిత్రాల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. రైతులు, విస్తరణ విభాగ అధికారులు, శాస్త్రవేత్తలకు పురస్కారాలు అందించారు.
కేంద్రానికి ప్రశంసలు..
2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు దిశగా.. ప్రధాని మోదీ నాయకత్వంలో కనీస మద్దతు ధర అందించడం సహా సాయిల్ హెల్త్ కార్డ్ పథకం, ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ - ఈనామ్ లాంటి ఎన్నో పథకాల ద్వారా ఆర్థిక స్థితి పెంచాయని వెంకయ్యనాయుడు అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే కార్యక్రమాలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం సహా రైతుకు చేయూతనందిస్తున్న పలు రాష్ట్రాలకు అభినందనలు తెలిపారు.
వెంకయ్య ఆవేదన..
'ఉత్తం ఖేతి మధ్యం వాన్ కరె చాకిరి కుకర్ నినాన్' అనే హిందీ సామెతను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి... దేశ ప్రజలు వ్యవసాయానికి ఎంతో ఉన్నతమైన స్థానం ఇచ్చారన్నారు. భారతీయుల దృష్టిలో వ్యవసాయం అంటే సిరులు మాత్రమే కాదని... సంస్కృతి కూడా అని.. పండుగలు, పబ్బాలు, ఆచార వ్యవహారాలన్నీ వ్యవసాయంతో ముడిపడి ఉన్నాయన్నారు. భారత సంస్కృతి, సంప్రదాయం, వారసత్వం, శాస్త్రీయ విజ్ఞానం లాంటి ప్రతి అంశంలోనూ సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ.. బ్రిటీష్ పాలనా కాలంలో చదువు రాని వ్యక్తులు మాత్రమే వ్యవసాయం చేస్తారనే ఓ ముద్ర పడిపోయిన దృష్ట్యా... తర్వాత అదే పరిస్థితి కొనసాగుతోందని ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీచూడండి: రైతుల ఆందోళనపై సుప్రీం కీలక వ్యాఖ్యలు