ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఘటన, మీడియా సమావేశంలో చంద్రబాబు కంటతడి పెట్టడంపై.....ఆయన సోదరుడి కుమారుడు నారా రోహిత్(nara rohit protest at Naravaripalli) నిరసన తెలిపారు. స్వగ్రామమైన చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోని చంద్రబాబు తల్లిదండ్రులు దివంగత నారా అమ్మణమ్మ, నారా కర్జూర నాయుడు సమాధుల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. తమ పెదనాన్న చంద్రబాబు, పెద్దమ్మ భువనేశ్వరి, సోదరుడు నారా లోకేశ్ క్రమశిక్షణకు మారుపేరని అన్నారు. సీనియర్ ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు నందమూరి కుటుంబం ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని.. ఎప్పుడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదన్నారు. సేవా కార్యక్రమాలే పరమావధిగా జీవిస్తున్న మహోన్నత వ్యక్తిత్వం తమ పెద్దమ్మ భువనేశ్వరిదని చెప్పారు.
చంద్రబాబు భావోద్వేగం..
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శుక్రవారం నాడు జరిగిన పరిణామాలపై తెదేపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి(Chandrababu crying news) గురయ్యారు. వైకాపా సభ్యులు.. ఏకంగా ఆయన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెక్కి వెక్కి ఏడ్చారు. తన భార్య వ్యక్తిత్వాన్ని కించపరిచేలా తీవ్రంగా అవమానించారంటూ... మాటలు తడబడుతూ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా చలించని చంద్రబాబు.... కష్టనష్టాల్లో తోడుగా నిలిచిన సతీమణిని అనరాని మాటలు అన్నారంటూ తీవ్రంగా ఆవేదన చెందారు. ఇలాంటి అవమానం తట్టుకోలేనంటూ వెక్కివెక్కి ఏడ్చారు. ఉబికి వస్తున్న కన్నీటిని చేతి రుమాలుతో తుడుచుకునే ప్రయత్నం చేసినా.... అవమానభారంతో ఆయనకు ఉద్వేగం ఆగలేదు. అధినేత కన్నీళ్లు పెట్టడం చూసిన తెలుగుదేశం నేతలు నిశ్చేష్టులయ్యారు. ఎలాంటి పరిస్థితులనైనా మొక్కవోని ధైర్యంతో దీటుగా ఎదుర్కొనే చంద్రబాబు.... ఒక్కసారిగా ఏడవడంతో వాళ్లూ కంటతడి పెట్టారు.
నందమూరి కుటుంబసభ్యుల స్పందన
తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నేతల వ్యాఖ్యలపై నందమూరి కుటుంబసభ్యులు స్పందించారు. తన సోదరి భువనేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమన్న బాలకృష్ణ(Balakrishna chandrababu naidu).. అసెంబ్లీలో ఉన్నామో, పశువుల కొంపలో ఉన్నామో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటతడి పెట్టుకోవటం తాము ఎప్పుడూ చూడలేదని నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రజాసమస్యలపై పోరాడాల్సిన అసెంబ్లీలో అభివృద్ధికి బదులు.. వ్యక్తిగత అజెండా తీసుకువచ్చారని మండిపడ్డారు. వైకాపా నుంచి మహిళా శాసనసభ్యులు సభలో ఉన్నారన్న బాలకృష్ణ.. అందరి కుటుంబాల్లో ఆడవాళ్లు ఉన్నారని.. హేళన చేయొద్దని హితవు పలికారు. ఈ పరిణామాలతో కొత్త నీచ సంస్కృతికి తెరలేపారని ఆక్షేపించారు. ఏపీ ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ స్పందన
తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఉద్దేశించి వైకాపా నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్(ntr about chandrababu incident) స్పందించారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన.. తన మనసును కలిచివేసిందన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే కానీ.. అవి ప్రజా సమస్యలపై జరగాలని వ్యాఖ్యానించారు.
'అసెంబ్లీలో జరిగిన ఘటన.. నా మనసును కలిచివేసింది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. విమర్శలు, ప్రతి విమర్శలు ప్రజా సమస్యలపై జరగాలి. వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. ఆడపడుచులపై పరుష వ్యాఖ్యలు.. అరాచక పాలనకు నాంది. ఆడవాళ్లను గౌరవించడం మన సంస్కృతి. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు జాగ్రత్తగా అప్పగించాలి'
- జూనియర్ ఎన్టీఆర్, ప్రముఖ నటుడు
ఇదీ చదవండి: Rajinikanth Phone call to Chandrababu : చంద్రబాబుకు నటుడు రజనీకాంత్ ఫోన్