నల్గొండలో పోలీసులు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్లపైకి వచ్చిన వాహనాలను అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా... రోడ్డుపై కనపడిన వారిని కనపడినట్లు లాఠీలతో కొట్టారు. ఈ క్రమంలోనే ఓ విద్యుత్ ఉద్యోగిపై దాడి చేశారు. ఈ ఘటనపై ఆ సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో సరఫరా అవుతున్న విద్యుత్‌ను నిలిపేసి నిరసన వ్యక్తం చేశారు.
పోలీసులకు చురకలు...
సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ కేవీ రంగనాథ్.. విద్యుత్ ఎస్‌సీ కృష్ణయ్యతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. మధ్యాహ్నం సుమారు 2 గంటలకు విద్యుత్ పునరుద్ధరించగా... సమస్య సద్దుమణిగింది. లాఠీఛార్జీ విషయం విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి దృష్టికి వెళ్లగా.. పోలీసులను మందలించారు. ఐడీ కార్డులు చూడకుండానే లాఠీలకు పనిచెప్పటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగులకు పాస్ ఇచ్చే ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
కొవిడ్ రోగులకు ఇబ్బంది...
మూడున్నర గంటల పాటు విద్యుత్ లేకపోవడం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగులు ఇబ్బంది పడ్డారు. దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ సమాధానమిచ్చారు. అయితే తాము పోలీస్ ఠాణాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేయలేదని.. బ్రేక్ డౌన్ అయినందునే ఇబ్బంది తలెత్తిందని ట్రాన్స్‌కో డీఈ చెప్పడం గమనార్హం.
లాఠీఛార్జీని ఖండించిన ఎంపీ కోమటిరెడ్డి
నల్గొండ పట్టణంలో పోలీసులు లాఠీఛార్జీ చేయడాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. లాక్‌డౌన్ ఉదయం 10 గంటలకు ప్రారంభమైతే ఉ.9.40 గం.లకే సామాన్య ప్రజలపై విరుచుకుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్కర పరిస్థితుల్లో అత్యవసర సేవలు అందజేస్తున్న విద్యుత్, ఆరోగ్య సిబ్బంది, మీడియా ప్రతినిధులపై సైతం లాఠీలతో దాడులకు పాల్పడటంపై మండిపడ్డారు. ప్రతి ఒక్కరికీ ప్రాణాలపై ఆశ ఉందని, కరోనా పట్ల అవగాహన ఉందని తెలిపారు. లాక్‌డౌన్ సమయం మొదలైన తర్వాత పది నిమిషాలు ఆలస్యమైతే విడిచిపెట్టాలి కానీ... 10 నిమిషాల ముందే ప్రజలు, సర్కార్ మినహాయింపు ఇచ్చిన సిబ్బంది, ఉద్యోగులపై లాఠీ ఛార్జీ చేయడాన్ని తప్పుపట్టారు.