Mysterious deaths: అప్పటివరకూ ఆరోగ్యంగానే ఉన్నారు. అంతలోనే ఏమైందో ఏమో అస్వస్థతకు గురయ్యారు. బుధ, గురువారం రెండు రోజుల్లోనే 15మంది ప్రాణాలు విడిచారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో కలకలం సృష్టిస్తోంది. ఇప్పుడీ మరణాలు మిస్టరీగా మారాయి. మృత్యువాతపడ్డవారిలో కొందరిలో వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరడం.. గంటల వ్యవధిలో మృతి చెందడం విషాదం మిగుల్చుతోంది. వీరిలో ఎక్కువమందికి మద్యం అలవాటు ఉందని, కల్తీ సారా తాగి చనిపోయారని కొందరు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
మృతుల్లో ఒకరిద్దరు 60 నుంచి 70 ఏళ్లవారు కాగా.. మిగిలినవారు 40 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్కులు. వీరంతా కూలి పనులు, చిన్న వృత్తులు చేసుకునేవారు. వీరిలో కొందరికి కుటుంబ సభ్యులు ఆర్‌ఎంపీలు, పీఎంపీల వద్ద, మరికొందరిని ప్రాంతీయ ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రులలో చేర్చి వైద్యం అందించారు. బుట్టాయగూడెం రోడ్డులోని గాంధీబొమ్మ సెంటర్‌లోని ఒకే వీధిలో ఇద్దరు చనిపోయారు.
‘మా నాన్న ముడిచెర్ల అప్పారావు (45) కడుపునొప్పి.. అంటే ఆర్‌ఎంపీ వద్ద చూపించాం. తరువాత పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాం.కొద్దిసేపటికే మా నాన్న చనిపోయారు’ అని ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాపీ పనులు చేసే బండారు శ్రీనివాసరావు (45) కడుపునొప్పితో బాధపడితే గురువారం ఉదయం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఆయన మేనల్లుడు వెంకట్ తెలిపారు. ‘వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఐసీయూలో పెట్టారు. కొద్దిసేపటికే మామయ్య చనిపోయారని చెప్పారు’ అని అన్నారు. అత్యధిక మరణాలు ఇదే తీరులో సంభవించినట్లు చెబుతున్నారు. ఇలా ఉన్నట్టుండి అస్వస్థతకు గురై మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చూడండి: నిద్రిస్తున్న తల్లిపై కొడుకు కర్కశత్వం.. కర్రతో దాడి చేసి..