MP Suresh Reddy Comments: పార్లమెంటులో చేసిన చట్టాల్లోని హామీలే ఏళ్లుగా నెరవేరకపోతే... చట్టసభలపై ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతుందని తెరాస రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి రాజ్యసభలో వాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కేంద్రం ఎన్నో హామీలు ఇచ్చిందని.. బిల్లు ఆమోదం పొంది 8 ఏళ్లు గడిచినా అవి నెరవేరలేదని ఆవేదన వ్యక్తంచేశారు. విభజన చట్టంలో ఇంకా నెరవేరాల్సినవి 38 అంశాలున్నాయని... వాటిని వెంటనే అమలు చేయాలని కోరారు. పార్లమెంటు వ్యవస్థపై అంచంచల విశ్వాసం ఉన్న రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు... ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సురేశ్‌రెడ్డి కోరారు.
"గిరిజన విశ్వవిద్యాలయం, కోచ్ ఫ్యాక్టరీ సహా ఎన్నో హామీలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ అంశాలను పరిష్కరించడానికి కేంద్రం సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతున్నా. 8 ఏళ్ల క్రితం బిల్లులు ఆమోదం పొందాయి. ఈ చట్టంలోని అంశాలను నెరవేర్చాల్సిన బాధ్యత రాజ్యాంగపరంగా కేంద్రంపై ఉంది. న్యాయం చేయడం ఆలస్యమైతే అన్యాయం చేసినట్లే. పార్లమెంటుపై ప్రజలు విశ్వాసం కోల్పోతారు. నిర్దిష్ట సమయంలో హామీలు నెరవేర్చేలా మీరు(వెంకయ్య నాయుడు) దిశానిర్దేశం చేయాలని కోరుతున్నా." -సురేశ్‌రెడ్డి, తెరాస ఎంపీ
ఇదీ చూడండి: