విద్యార్థి స్థాయిలోనే ఆవిష్కర్తలుగా తీర్దిదిద్దడం కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో 15 ఎకరాల్లో ‘నవం’ ఆవిష్కరణల కేంద్రం (ఫౌండేషన్) ఏర్పాటుకానుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ ఆవిష్కరణల విభాగం (టీఎస్‌ఐసీ), అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్, ప్రవాహ ఫౌండేషన్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాంగణం మూడేళ్లలో ప్రారంభమవుతుంది. పదేళ్లలో రూ. 3,000 కోట్ల పెట్టుబడులతో దీనిని అభివృద్ధి చేస్తారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఆవిష్కరణలపై ప్రయోగశాల, ప్రతిభా కేంద్రం ప్రారంభిస్తారు.
నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల జిల్లాల్లో కిందిస్థాయిలోని 11-18 వయసు విద్యార్థులు మొదలుకొని 19-25 ఏళ్ల వయసు యువతను ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దుతారు. వారికి శిక్షణ కేంద్రాలతో పాటు మినీ శాస్త్ర కేంద్రాలు (సైన్స్ సెంటర్లు) ఏర్పాటు చేస్తారు. ఇంటింటా సైన్స్ ల్యాబ్‌ల వంటి ఆవిష్కరణలకు ప్రోత్సాహిస్తారు. ఇది ఉపాధ్యాయ శిక్షణకు వనరుల కేంద్రంగానూ ఉపయోగపడుతుంది. ప్రాంగణ శిక్షణ, ఇంటర్న్‌షిప్‌లతో పాటు అంకుర వ్యవస్థాపకులైన యువతకు సాయం (ఫెలోషిప్)ను అందిస్తుంది. రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, ప్రవాహ ఫౌండేషన్ ప్రతినిధి వినోద ఈ ఒప్పందంపై మంగళవారం సంతకాలు చేశారు.
‘‘నవం ఫౌండేషన్ ద్వారా తెలంగాణ అంతటికీ ఆవిష్కరణలు విస్తరిస్తాయి. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల ఆలోచనా సరళిని మార్చేలా సరికొత్త విధానంలో బోధనల వల్ల ఆవిష్కరణలకు బీజం పడుతుంది. వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు దోహదపడుతుంది. కొత్త విద్యావిధానంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఈ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆవిష్కరణల కోణంలో శిక్షణ ఇచ్చి నైపుణ్యాన్ని పెంచుతాం. ఇందులో టీఎస్‌ఐసీ ప్రధాన పాత్ర పోషిస్తుంది’’ -జయేశ్‌రంజన్, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి.
ప్రవాహ ఫౌండేషన్ ఛైర్మన్, ట్రస్టీ రవి కైలాస్ మాట్లాడుతూ, తెలంగాణను ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దడం, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మార్చడమే తమ లక్ష్యమని అన్నారు. అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఛైర్మన్ రామ్‌జీ రాఘవన్, తదితరులు మాట్లాడారు.