Ayyanna Patrudu news : ఏపీ మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడిపై మరో కేసు నమోదైంది. ఈ కేసులో సెక్షన్ 41ఏ నోటీసును అందజేసేందుకు విశాఖపట్నం త్రీటౌన్ పోలీసులు ఇద్దరు గురువారం రాత్రి నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటికి వెళ్లారు. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ను కలిసి తాము త్రీటౌన్ స్టేషన్ నుంచి నోటీసు ఇచ్చేందుకు వచ్చామని చెప్పారు. అయ్యన్న ఇంట్లో లేరని, నోటీసు తనకు ఇచ్చినా.. ఇంటికి అతికించినా అభ్యంతరం లేదని విజయ్ వారికి చెప్పారు.
అయితే.. ఉన్నతాధికారులతో చర్చించాక మళ్లీ వస్తామంటూ వారు వెనుదిరిగారు. కేసు వివరాలను విజయ్ అడిగినా వెల్లడించేందుకు నిరాకరించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. త్రీటౌన్ పోలీసులు క్రైం నంబరు 317 ప్రకారం సెక్షన్ 153, 153ఎ, 504, 505, సెక్షన్ 67 ఐటీ చట్టం ప్రకారం.. అయ్యన్నపై కేసు నమోదు చేశారు. కొద్దిరోజుల కిందట పల్నాడు జిల్లా నకరికల్లు పోలీసులు గతంలో నమోదైన ఓ కేసుకు సంబంధించి 41ఏ నోటీసు ఇచ్చేందుకు రావడం, స్థానికంగా అయ్యన్న లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిన విషయం తెలిసిందే.
అయ్యన్న పాత్రుడు పంటకాలువ ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారంటూ.. ఈ నెల 19న జేసీబీలతో ఇంటి గోడను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. రెండు సెంట్ల భూమి ఆక్రమించి నిర్మాణం చేపట్టారంటూ.. మున్సిపల్ సిబ్బంది నోటీసులో పేర్కొన్నారు.