అత్యంత చవకైన రవాణా సంస్థగా పేరొందిన ఎంఎంటీఎస్( మల్టీ మోడల్ ట్రాన్స్ ఫోర్ట్ సర్వీస్ ) 121 రైళ్ల సర్వీసులతో హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో సేవలందిస్తోంది. నగర రవాణా వ్యవస్థ విస్తరణలో భాగంగా 84 కిలోమీటర్ల ఎంఎంటీఎస్ ఫేజ్ -2 నిర్మాణం ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన పనులు చేపడుతున్నారు.
డుబుల్ లైన్‌కు అదనంగా..
నగరం పడమటి వైపు తెల్లాపూర్-రామచంద్రాపురం మధ్య నూతన రైలు మార్గం నిర్మాణం జరగుతోంది. సిటీకి ఉత్తరం వైపున బొల్లారం-మేడ్చల్ మధ్య డబ్లింగ్, విద్యుదీకరణ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఘట్ కేసర్-మౌలాలి మధ్య అందుబాటులో ఉన్న డబుుల్ లైన్‌కు అదనంగా.. కొత్తగా మరో రెండు లైన్ల రైలు మార్గం విద్యుదీకరణ, ఆటో మెటిక్ సిగ్నలింగ్ పూర్తిచేశారు.
దక్షిణ మధ్య రైల్వేలోనే..
నగరం తూర్పు, పడమరలను అనుసంధానిస్తూ సికింద్రాబాద్ బైపాస్ స్టేషన్‌గా మౌలాలి-సనత్‌నగర్ మధ్య 5 స్టేషన్లు.. దక్షిణం వైపు ఫలక్‌నుమా-ఉందానగర్ మధ్య స్టేషన్లకు డబ్లింగ్, విద్యుదీకరణ పనులు కొనసాగుతున్నాయి. రైల్ వికాస్ నిగం లిమిటెడ్ ఆధ్వర్యంలో దశలవారీగా ఈ పనులు చేపడుతున్నారు. ఇప్పుడు మౌలాలి-ఘట్ కేసర్ మధ్య రైళ్లు నడపడానికి ఆటోమెటిక్ సిగ్నలింగ్‌తో పాటు విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. మౌలాలి-ఘట్ కేసర్ నాలుగు వరుసల రైలు మార్గ సౌకర్యం దక్షిణ మధ్య రైల్వేలోనే ప్రప్రథమ సెక్షన్‌గా పేరు పొందింది.
ఒకే సమయంలో నాలుగు సర్వీసులు..
మౌలాలి-ఘట్ కేసర్ సెక్షన్ ముఖ్యమైన రైలు మార్గం. ఈ సెక్షన్లో రద్దీని తగ్గించేందుకు, సబర్బన్ రైళ్లను నిర్వహించడానికి రెండు లైన్లు, నాలుగు లైన్ల మార్గంగా మార్చారు. ఈ నాలుగు లైన్లలో రెండు లైన్ల మార్గాన్ని మౌలాలి నుంచి ఘట్ కేసర్‌కు.. మరో రెండు లైన్లను ఘట్ కేసర్ నుంచి మౌలాలికి రైలు సర్వీసులను ఒకే సమయంలో నడపడానికి ఉపయోగిస్తున్నారు. ఈ సెక్షన్ పూర్తిగా ఆటోమెటిక్ కాబట్టి ఇంతకు ముందు కంటే అధిక సంఖ్యలో రైళ్లను నడపడానికి దోహదపడుతుంది.
ఎంఎంటీఎస్ ఫేజ్-2లో భాగమైన ఈ నాలుగు వరుసల రైలు మార్గం నిర్మాణానికి రూ.200 కోట్లు ఖర్చు చేశారు.
ఇవీ చూడండి: 'కాజీపేటలో రైల్వే కోచ్ పరిశ్రమ ఏర్పాటు చేయాలి'