హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ జవహర్‌నగర్‌లో తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర కార్యాలయాలను కొవిడ్ హెల్ప్ లైన్ కేంద్రంగా మార్చారు. ఈ సహాయ, ఐసోలేషన్ కేంద్రాన్ని శాసనమండలి సభ్యుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వెంకట్, తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి, ఇతర ప్రజా సంఘాల నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు.
కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో నివారణ చర్యల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఎమ్మెల్సీ ఆరోపించారు. దేశంలో కొవిడ్ రెండో వేవ్ వస్తుందని వైద్య ఆరోగ్య నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరించినా ముందస్తు జాగ్రత్తలు చేపట్టడంలో పూర్తి నిర్లక్ష్యం వ్యవహరించారని విమర్శించారు.