ఏపీ ముఖ్యమంత్రి జగన్(cm jagan)ను తెదేపా నేత అయ్యన్నపాత్రుడు(tdp leader ayyanapatrudu) అసభ్య పదజాలంతో దూషిస్తే నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు. ఏపీ సీఎం, మంత్రులు, మహిళా హోంమంత్రిని దూషించిన ఘటనపై.. చంద్రబాబు(tdp chief chandrababu)ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడానికి.. అక్కడికి వెళ్లినట్లు ఆయన తెలిపారు. తన వెంట తమ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారని చెప్పారు.
మాపై దాడి చేయించారు..
చంద్రబాబు తన నివాసంలో గూండాలు, రౌడీషీటర్లను పెట్టుకుని తనపై దాడి చేశారని అన్నారు. తమపై రాళ్లు రువ్వించి కారు అద్దాలు పగలగొట్టించారని చెప్పారు. కారు దిగకముందే తన కారు అద్దాలు పగలగొట్టారని తెలిపారు.
ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేందుకే ప్రయత్నాలు
ఓ సాధారణ పౌరుడిగా సీఎం జగన్‌ను తిట్టడం సహించలేక నిరసన తెలపడానికి వెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నిరసన తెలిపితే తనను సైతం పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేందుకే.. చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని జోగి రమేష్ విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపేందుకు వెళితే దండయాత్ర అంటున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందే
అయ్యన్నపాత్రుడు మాట్లాడిన అసభ్య పదజాలంపై.. చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. చంద్రబాబు పర్యటనల్లో నిరసన తెలియజేస్తూనే ఉంటామని మరోమారు హెచ్చరించారు. నిరసన ఘటన కేవలం ఆరంభం మాత్రమేనని తెలిపారు. చంద్రబాబు, లోకేశ్‌లు ఏపీకి విజిటర్స్ మాత్రమేనని జోగి రమేష్ విమర్శించారు. అడ్రస్, డోర్ నంబరు లేని నేతలు ఇక్కడ సవాళ్లు ఎలా చేస్తారని నిలదీశారు.