Jaggareddy on NTR University Name Change: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడంపై ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఖండించారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు సరికాదని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసే పనులు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని సూచించారు. అదే అధికారంలో లేనప్పుడు ఎలా నడుచుకున్నా ఎవరూ పట్టించుకోరని అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్, వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఉద్దేశిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'తెలుగు ప్రజల్లో మంచి పేరున్న వ్యక్తి ఎన్టీఆర్. వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసి వివాదానికి దారి తీయడం తప్పు. వివాదాలతో పేరు పెడితే వైఎస్‌కి చెడ్డ పేరు వస్తుంది. వైకాపాలో ఎన్టీఆర్ వద్ద పనిచేసిన వాళ్లే ఉన్నారు కదా? జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఫ్యాక్షన్ స్టైల్‌లోనే ఉంటే ఎట్లా?'- జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే
తండ్రి బాటలో షర్మిల నడవడం లేదు.. 'వైఎస్ షర్మిల పాదయాత్ర నాయకులను తిట్టేందుకు చేస్తున్నారా? నేతలపై వ్యక్తిగతంగా బురద చల్లితే ఎలా? మా దగ్గర కూడా అలాంటివి చాలా ఉంటాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె అయినంత మాత్రాన విమర్శిస్తే ఊరుకుంటామా? తండ్రి బాటలో షర్మిల నడవడం లేదు. ఇంతవరకు ఆమె భాజపాను విమర్శించినట్లు చూడలేదు. ప్రధాని మోదీని షర్మిల ఎందుకు ప్రశ్నించడం లేదు?' అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.
మోదీ, అమిత్‌షా చెప్పినట్లు వాళ్లు పనిచేస్తున్నారు.. జగన్, షర్మిల ఇద్దరూ భాజపా వదిలిన బాణాలే అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇది ప్యూర్ భాజపా డైరెక్షన్.. మోదీ, అమిత్‌షా చెప్పినట్లు వాళ్లు పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రాంత ప్రజల ఓటు బ్యాంకు చీల్చి భాజపాకు ఉపయోగపడాలనేది వారిద్దరి రాజకీయ వ్యూహమని అన్నారు. అడ్డగోలుగా సంపాదించి వాళ్ల గుట్టు రట్టు కాకుండా ఉండేందుకు భాజపా కంట్రోల్‌లో పనిచేస్తున్నారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
ఏపీకి అమరావతినే రాజధానిగా ఉండాలనేది కాంగ్రెస్ నిర్ణయమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఏపీ కాంగ్రెస్ కూడా అదే నిర్ణయంలో ఉందని అన్నారు. మూడు ప్రాంతాల్లో 3 రాజధానుల నిర్ణయం సరికాదని పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్‌ది తప్పుడు నిర్ణయమని వ్యాఖ్యానించారు. అమరావతి పేరు పెట్టడంలో చంద్రబాబు దృక్పథంతో నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మూడుచోట్ల 3 రాజధానులతో అభివృద్ధి జరగడం సాధ్యం కాదని తెలిపారు.
ఇవీ చదవండి: