భాజపా డైరెక్షన్లోనే వైఎస్ షర్మిల పార్టీ పెడుతున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఏపీ సీఎం జగన్ ఇప్పటికే భాజపాతో కలిసి పనిచేస్తున్నారని పేర్కొన్న జగ్గారెడ్డి... తెదేపా గోడమీద పిల్లిలా ఏటు తేల్చుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు. వైకాపా, తెరాస, భాజపా... మూడు కలిసి కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకునే కుట్ర పన్నుతున్నాయని ఆక్షేపించారు.
"ఉత్తరాదిలో పట్టు కోల్పోతున్నందునే... భాజపా దక్షిణ భారత్‌పై దృష్టి పెట్టింది. కాంగ్రెస్‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బలమైన కంచుకోట. సెటిలర్స్‌ను షర్మిల వైపు తిప్పుకొనేందుకే కొత్త పార్టీ పెడుతున్నారు. కాంగ్రెస్‌లో తమలాంటి వారెందరో వైఎస్‌కు వారసులు ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ నుంచి విడదీయడానికే షర్మిలను భాజపా రంగంలోకి దించింది. ఇప్పుడు షర్మిల వచ్చారు... రేపు జూనియర్ ఎన్టీఆర్ లేదంటే ఎన్టీఆర్ కుటుంబం నుంచి మరో వ్యక్తి కూడా పార్టీ పెట్టొచ్చు."
-జగ్గారెడ్డి
ఇదీ చూడండి: భారత ఫుట్‌బాల్ మహిళా జట్టులో తెలుగమ్మాయికి స్థానం