Balakrishna comments on Gorantla: ఏపీ వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ సభ్య సమాజం తలదించుకునే పని చేశారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సత్యసాయి జిల్లా లేపాక్షిలో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాధవ్ తీరుపై బాలకృష్ణ మండిపడ్డారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే.. ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రజలకు సేవ చేయకుండా నీలి చిత్రాలు చూపించారని విమర్శించారు. ఎంపీ ఏ ముఖం పెట్టుకుని హిందూపురంలో జాతీయ జెండా ఎగురవేసేందుకు వచ్చారని ప్రశ్నించారు. ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సీఎం జగన్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వైకాపా ప్రభుత్వంపై బాలకృష్ణ ధ్వజమెత్తారు. చేతకాని పాలనతో ప్రజలను కష్టాలపాలు చేశారని విమర్శించారు. అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, వైకాపా ప్రభుత్వం రైతులను తీవ్రంగా మోసం చేసిందన్నారు. కనీసం ఎరువులు, విత్తనాలను కూడా రాయితీపై ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమానికి తెదేపా నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.
బాలకృష్ణకు ఘనస్వాగతం..: హిందూపురంలో బుధవారం ఎమ్మెల్యే బాలకృష్ణ సందడి చేశారు. నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన ఆయనకు తూముకుంట చెక్‌పోస్ట్ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం బాలయ్య తన సతీమణి వసుంధరా దేవితో కలిసి హిందూపురం గ్రామీణ మండలం చలివెందులలో ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు.
ఇవీ చదవండి:
గోరంట్ల మాధవ్ వీడియో నిజమైనదేనని తెదేపా నేతల ఫోరెన్సిక్ రిపోర్ట్