ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో 36 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. అనుకున్నట్లే జగన్ మంత్రివర్గ సహచరులంతా.. మూకుమ్మడిగా రాజీనామా సమర్పించారు. జగన్ నేతృత్వంలో త్వరలో రెండో కేబినెట్ కొలువు దీరనుండటంతో.. మొదటి కేబినెట్ చిట్టచివరి సమావేశంలో మంత్రిమండలిలోని 24 మంది మంత్రులూ రాజీనామా చేశారు. తమ రాజీనామాలను సీఎం జగన్‌కు సమర్పించారు. అనంతరం మంత్రులు తమ ప్రోటోకాల్ వాహనాలు వెనక్కి ఇచ్చారు. మంత్రుల రాజీనామా పత్రాలను సీఎం జగన్ రేపు గవర్నర్‌కు సమర్పించే అవకాశం ఉంది.
ఈనెల 11న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే 25 మందీ కొత్తవారే ఉంటారా? లేదా ప్రస్తుత మంత్రుల్లో కొంతమంది కూడా అందులో ఉంటారా? అనేది చర్చనీయాంశంగా మారింది. కుల సమీకరణాల రీత్యా ప్రస్తుత కేబినెట్లోని కొందరు మంత్రులు కొత్త కేబినెట్లోనూ కొనసాగే అవకాశాలున్నట్టు సమాచారం. ఈ మేరకు కొత్త కేబినెట్లో కుల సమీకరణలు, అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. సీనియర్ మంత్రుల అనుభవం కేబినెట్‌కు అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. రాజీనామాల విషయంలో బాధపడుతున్నట్లు జగన్ మంత్రులతో చెప్పగా.. మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని జగన్‌కు మంత్రులు తెలిపారు. కాగా.. కొత్త మంత్రులు ఎవరన్న విషయాన్ని ఈ నెల 9 లేదా 10 ఉదయం వరకు గోప్యంగానే ఉంచే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: ఒక మహిళను గౌరవించే విధానం ఇదేనా..? : గవర్నర్ తమిళిసై