తెలంగాణ పోరాటంలో మాజీ హోం నాయిని నర్సింహారెడ్డి ముందుండి పనిచేశారని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. నాయిని మృతి తెలంగాణ ప్రజలకు తీరని నష్టమన్నారు. ప్రతి పేదవాడి కోసం కృషిచేశారని గుర్తు చేసుకున్నారు.
పెద్దలు నాయిని నర్సింహారెడ్డి అనేక ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి ఇప్పడు లేకపోవడం చాలా బాధాకరం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి అని ఆయనను కొనియాడారు.
నాయిని రాజకీయ ప్రస్థానం ముషీరాబాద్ నుంచి మొదలైందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం 1969లో పోరాడి జైలుకు వెళ్లారన్నారు. శాంతిభద్రతలు, కార్మిక సంక్షేమం కోసం నాయిని కృషిచేశారని వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం 12:30 గం.కు మహాప్రస్థానంలో నాయిని అంత్యక్రియలు నిర్వహిస్తామని తలసాని వివరించారు.
నాయిని మృతిపట్ల మంత్రి పువ్వాడ అజయ్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయిని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
"నాయిని నర్సింహారెడ్డి కార్మికుల పక్షపాతి. తన జీవితాంతం కార్మికుల అభివృద్ధి కోసమే పాటుపడ్డారు. వారు నిబద్ధత గల నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి సీఎం కేసీఅర్ వెంట నడిచిన వ్యక్తి. కార్మికుల కోసం తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు నాయిని నర్సింహారెడ్డి. తెలంగాణ రాష్ట్ర మొదటి హోం మంత్రిగా పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు చేపట్టారు. అందరినీ తమ్మి.. బాగున్నావా.. అంటూ పలకరించే ఎటువంటి కల్మశం లేని వ్యక్తి. నాయకుని మృతి కార్మిక లోకానికి, తెలంగాణ ప్రజలకు తీరని లోటు. నాయిని నర్సింహారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియచేస్తున్నాను."
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఇదీ చూడండి : నాయిని మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు: సీఎం కేసీఆర్