భట్టిని వెంటబెట్టుకుని లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు చూపిస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఇచ్చిన మాటమేరకు... హైదరాబాద్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు మంత్రి చూపిస్తున్నారు. నగరంలో 60 చోట్ల డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తున్నామన్న తలసాని... హౌసింగ్ బోర్డ్ స్థలాల్లో నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ ...
ఇళ్ల గురించి మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారన్నారు. అర్హులైన పేదలకు మాత్రమే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇంతపెద్ద ప్రాజెక్టు పూర్తవ్వాలంటే కాస్త సమయం పడుతుందన్న మంత్రి... కరోనా వల్ల ఇళ్ల పనుల్లో జాప్యం జరిగిందని వివరించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని మంత్రి తలసాని వెల్లడించారు.
లెక్క రేపు చెబుతా...
గ్రేటర్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పరిశీలించినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌లో 2.68 లక్షల ఇళ్లు ఇస్తామన్న తెరాస ప్రభుత్వం... ఇప్పటివరకు లక్ష పూర్తైనట్లు చెబుతున్నారని పేర్కొన్నారు. ఎన్ని పూర్తయ్యాయి, ఎంత నాణ్యంగా ఉన్నాయో రేపు చెబుతానని భట్టి స్పష్టం చేశారు.