Ministers comments on BJP: ఎమ్మెల్సీ కవిత ఇంటిపై భాజపా కార్యకర్తలు దాడికి పాల్పడటంపై తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్యేలు గోపీనాథ్, ముఠా గోపాల్, దానం నాగేందర్, బాల్కసుమన్, జీవన్‌రెడ్డి తదితరులు కవిత ఇంటికి వెళ్లి తమ సంఘీభావం తెలిపారు. శాంతియుతమైన హైదరాబాద్‌ను నాశనం చేయడం దారుణమని పశుసంవర్ధకశాఖ మంత్రి శ్రీనివాస యాదవ్ ధ్వజమెత్తారు. ఇలాంటి పరిణామాలు పువరావృతమైతే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కవిత ఇంటిని భాజపా నేతలు ముట్టడి చేసి, దాడికి యత్నించడం దారుణమని మంత్రి అన్నారు. ఎవరి ఇంటిమీదికైనా వెళ్లి దౌర్జన్యం చేస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు.
"భాజపా నేతలు ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేయడం దారుణం. మీ ఇళ్లపైకి రావాలంటే పెద్ద విషయం కాదు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తీవ్రంగా ఉంటాయి. ఎవరి ఇంటిమీదికైనా వెళ్లి దౌర్జన్యం చేస్తే ఊరుకుంటారా? మేం దాడులు చేస్తే భాజపా నేతలు మిగులుతారా? క్రమశిక్షణ అంటే ఇదేనా? భాజపా నేతలు చెప్పాలి." - తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి
నిజంగా తప్పు జరిగిందని తేలితే కేసులు పెట్టాలి కానీ.. భౌతికంగా దాడి చేయడమేంటని మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రశ్నించారు. ప్రజాకోర్టులో దోషులుగా నిలబడే పరిస్థితి వస్తుంది... జాగ్రత్త అని హెచ్చరించారు. ఇప్పటివరకు ఊరుకున్నాం.. ఇక ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. సీఎం మాట్లాడకుండా ఉండాలనే కవిత ఇంటిపై దాడి చేశారని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు. భాజపా నేతల దాడిని ఖండిస్తున్నట్టు తెలిపారు.
"భాజపా నేతల దాడిని ఖండిస్తున్నా. మా సైన్యం ఎంత ఉందో తెలుసుగా...మేం దాడిచేస్తే మీరు తట్టుకోగలరా? మమ్మల్ని ముట్టుకుంటే మీరు బూడిదైపోతారు. ఎవరైతే భాజపాకు లొంగిపోతారో వాళ్ల కేసులు ముందుకు వెళ్లవు." - జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే